Homeనిప్పుతో చెలగాటం వద్దు

నిప్పుతో చెలగాటం వద్దు

- Advertisement -

ఒక్క ఓటు తొలగించినా సర్కారు కూల్చేస్తాం

బీజేపీకి మమత హెచ్చరిక
. ఈసీపై రహస్య రిగ్గింగ్‌ ఆరోపణలు
. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా బెంగాల్‌లో భారీ ర్యాలీ

కోల్‌కతా: ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌ గర్జించింది. నిప్పుతో చెలగాటం వద్దంటూ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అన్యాయంగా ఒక్క ఓటు తొలగించినా దిల్లీలో పీఠం కదులుతుందని, సర్కారు కూలుతుందని స్పష్టంచేసింది. ఎస్‌ఐఆర్‌ పేరిట ఒక్క ఓటరు పేరు తొలగించినా బెంగాల్‌ సత్తా ఏమిటో దిల్లీకి చూపిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. దిల్లీలో బెంగాలీల మెగా ఆందోళన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సర్కారుకు సూచించారు. ప్రధాని మోదీ తన ఇష్టానుసారం సామాన్యులపై పెత్తనం చలాయిస్తున్నారంటూ నోట్ల రద్దు, పౌరసత్వం కోసం పత్రాలు అడగడాన్ని ఉద్దేశించి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ వ్యాఖ్యానించారు. సీఏఏ క్యాంపులు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందన్నారు. ‘ఎన్‌ఆర్‌సీ కారణంగా అసోంలో ఓటు హక్కును బెంగాలీలు కోల్పోయారు. మీరు కూడా వారి (బీజేపీని ఉద్దేశించి) ఉచ్చులో చిక్కుకుంటే 12 లక్షల మంది హిందువుల్లానే సర్వం కోల్పోతారు’ అని బెంగాల్‌ ప్రజలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ హెచ్చరిక చేసింది.
ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ అధ్వర్యంలో రాజధాని నగరం కోల్‌కతాలో మంగళవారం భారీ ర్యాలీ జరిగింది. అభిషేక్‌ బెనర్జీతో కలిసి మమత 3.8 కిమీల ర్యాలీ నిర్వహించారు. రెడ్‌ రోడ్‌లోని బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పూర్వీకుల ఇల్లు జోరాసాంకో ఠాకూర్‌ బరి వరకు మార్చ్‌ జరిగింది. వేలాది మంది టీఎంపీ మద్దతుదారులు పార్టీ జెండాలు చేబూని ఎస్‌ఐఆర్‌ వ్యతిరేక నినాదాలు, ప్లకార్డులతో, రంగుల పోస్టర్లతో కదం తొక్కారు. మమత, అభిషేక్‌ వెంట తృణమూల్‌ అగ్రనేతలు, మంత్రులు నడిచారు. ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ సాగించారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నిశ్శబ్ద`రహస్య రిగ్గింగ్‌ లక్ష్యంతోనే ఎస్‌ఐఆర్‌ చేపడుతున్నట్లు ఆరోపించారు. ‘ఓటు దొంగ… కుర్చీ వీడాలి’ నినాదంతో ర్యాలీ సాగిన మార్గం మార్మోగింది.
మమతా బెనర్జీ మాట్లాడుతూ బెంగాల్‌ ఓటరు జాబితా నుంచి ఒక్క పేరు తొలగించినా బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు. బెంగాలీ వలసదారులను బంగ్లాదేశీయులుగా ముద్రవేస్తూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారన్న భయం అసంఘటిత రంగ కారిక్ములను వెంటాడుతోందన్నారు. బంగ్లా భాషలో మాట్లాడినంత మాత్రానా బంగ్లాదేశీయులు అయిపోరని, హిందీ`పంజాబీలో మాట్లాడితే పాకిస్థానీలు కాబోరని అన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేయని వారు నోరు పారేసుకుంటూ… భయోత్పాతం సృష్టిస్తున్నారని విమర్శించారు. ‘స్వాతంత్య్ర పోరాటమప్పుడు బీజేపీ ఎక్కడుంది? భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ నాడు ఒక్కటే భూభాగమని వారికి తెలియదు’ అని మమత దుయ్యబట్టారు. బీజేపీని లుటేరా (దోపిడీదారు) పార్టీగా అభివర్ణించారు. నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం వ్యాప్తికి అనేక సంస్థలను దుర్వినియోగపరుస్తోందని, భవిష్యత్‌లో అధికారంలో ఉండబోదని సీఎం అన్నారు. అభిషేక్‌ బెనర్జీ మాట్లాడుతూ ‘కేవలం రెండు రోజుల్లో ఇంత భారీ సభ నిర్వహించగలిగామంటే… దిల్లీలో ఆందోళనను ఏ స్థాయిలో నిర్వహించగలమో బీజేపీ ఆలోచించుకోవాలన్నారు. దిల్లీ సామంతులకు తలొగ్గేది లేదని స్పష్టంచేశారు. దిల్లీలో బెంగాల్‌ గర్జనకు సిద్ధంగా ఉండండని కేంద్ర పాలకులను హెచ్చరించారు. ఎస్‌ఐఆర్‌ భయంతో రాష్ట్రంలో ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు తీసుకున్నారని అభిషేక్‌ వెల్లడిరచారు. ఎస్‌ఐఆర్‌ భయంతో ఏడు రోజుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారన్నారు. ఓటు హక్కును హరిస్తారన్న భయమే వారి ప్రాణాలు తీసిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు