Homeపర్యాటకానిదే భవిష్యత్‌

పర్యాటకానిదే భవిష్యత్‌

- Advertisement -

. పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా
. పర్యాటక శాఖ సలహాదారుగా బాబా రామ్‌దేవ్‌
. టూరిజం క్యార్‌వాన్‌లు ప్రారంభించిన చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అన్ని ఇజాలకన్నా టూరిజమే మిన్న అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పర్యాటకానికి సంబంధించి దశాబ్దాల కిందట తాను చెప్పిన మాట నిజమవుతోందని, భవిష్యత్‌ అంతా పర్యాటక రంగానిదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. పర్యాటక రంగం ద్వారానే పెద్దఎత్తున ఉద్యోగ కల్పనకు అవకాశం ఉందన్నారు. విజయవాడ మురళీ ఫార్చూన్‌ హోటల్‌లో శుక్రవారం జరిగిన గ్లోబల్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్సఫర్మేషన్‌ (జీఎఫ్‌ఎస్టీ) టూరిజం కాన్‌క్లేవ్‌కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ అంతర్జాతీయ పర్యాటక రంగానికి కేంద్రబిందువుగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. గేమ్‌ ఛేంజర్‌ కాబట్టే… పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా ఇచ్చామన్నారు. వెల్‌నెస్‌, హ్యాపీనెస్‌ ఫ్యూచర్‌ డెస్టినేషన్‌గా ఏపీని మారుస్తామన్నారు. పెట్టుబడులను ఆకట్టుకునేలా రాష్ట్ర పర్యాటక విధానాన్ని తీర్చిదిద్దామని, హెల్తీ, వెల్తీ, హ్యాపీ అనే నినాదంతో ముందుకెళుతున్నామని చెప్పారు. ఐటీ, ఉత్పత్తి పరిశ్రమలు, వ్యవసాయం కంటే ఎక్కువ మందికి పర్యాటక రంగం ఉద్యోగాలు కల్పిస్తోందన్నారు. పర్యాటక రంగం 20 శాతం వృద్ధి నమోదు చేస్తుందని, భక్తుల్ని, పర్యాటకుల్ని ఆకట్టుకునేలా వెంకటేశ్వరస్వామి ఆలయం ఉందని, శ్రీశైలంతో పాటు మరో 10 ప్రముఖ దేవాలయాలు పర్యాటక సర్క్యూట్‌లో ఉన్నాయని తెలిపారు. టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజం, అద్భుతమైన బీచ్‌లు, పురాతత్వ ఆనవాళ్లు కలిగిన ప్రదేశాలు, మెయ్యి కిలోమీటర్ల బీచ్‌లైన్‌, కోనసీమ, హార్సిలీ హిల్స్‌ ఇలా వేర్వేరు అంశాలు ఆకర్షణలుగా ఉన్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం అఖండ గోదావరి ప్రాజెక్టు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు కార్యాచరణ చేపట్టామని, అనుమతుల విషయంలో ఒక్క గంట వృథా కాకుండా అనుమతులు ఇస్తామని వెల్లడిరచారు. పర్యాటక ప్రాజెక్టులకు విద్యుత్‌ సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, పర్యాటక రంగంలో ఏపీ నెంబర్‌-1 కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 3 వేల హోటల్‌ గదులు అందుబాటులో ఉన్నాయని, వచ్చే నాలుగేళ్లలో వాటిని 15 వేలకు పెరిగేలా చేస్తామని వివరించారు. మరో 21 టెంపుల్‌ సర్క్యూట్లు, రెండు బౌద్ధ సర్క్యూట్లు, 25 థీమాటిక్‌ సర్క్యూట్లు ఉన్నాయని సీఎం తెలిపారు. ఈ రంగంలో ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టులకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. రవాణా కోసం బ్రిటీష్‌ పాలకులు తవ్వించిన బకింగ్‌హామ్‌ కాలువ లాంటి వాటిని కూడా పర్యాటకానికి వినియోగిస్తామన్నారు. మూడు దశాబ్దాల క్రితం ఐటీని ప్రోత్సహించినట్టే ఇప్పుడు పర్యాటకాన్ని ప్రమోట్‌ చేస్తున్నామని సీఎం చెప్పారు. అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని, దీంతో పాటు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికత విస్తృతంగా అమలు చేయబోతున్నామన్నారు. ఆగస్టు 15 తర్వాత అన్ని పౌర సేవలూ వాట్సాప్‌ ద్వారానే అందుతాయని చెప్పారు. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా యువతకు నైపుణ్యం కల్పించాలని నిర్ణయించామని వెల్లడిరచారు.
పర్యాటక సలహాదారుగా బాబారామ్‌దేవ్‌
యోగాలో ప్రజల్ని ప్రభావితం చేసినట్టే రాష్ట్ర పర్యాటకాన్ని బ్రాండిరగ్‌ చేయాలని ప్రముఖ యోగాగురు బాబా రామ్‌దేవ్‌ను సీఎం చంద్రబాబు కోరారు. పర్యాటకం వెల్‌నెస్‌ కేంద్రాలకు బాబా రామ్‌దేవ్‌ సలహాదారుగా సేవలు అందించాలన్నారు. పతంజలి సంస్థను అగ్రస్థానానికి చేర్చినట్టే ఏపీ పర్యాటక రంగాన్ని మార్కెటింగ్‌ చేయాలని సూచించారు. బాబా రామ్‌దేవ్‌ ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు తేవటంలో కృషి చేయాలని, ప్రధాని మోదీ కోరిన మేరకు విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా డే నిర్వహించి… గిన్నిస్‌ రికార్డులు, ప్రపంచ రికార్డులు సాధించామని వివరించారు. దేశంలో చంద్రబాబు కంటే దార్శనికత కలిగిన నేత… ప్రజాహితం కోరే నాయకుడు ఎవరూ లేరని బాబా రామ్‌దేవ్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలుగు ప్రజలకు దేవుడు పంపిన వరం అంటూ కొనియాడారు. అనంతరం హరిద్వార్‌ నుంచి తెచ్చిన పవిత్ర గంగా జలాన్ని చంద్రబాబుకు రామ్‌దేవ్‌ అందజేశారు. జీఎఫ్‌ఎస్టీ టూరిజం కాన్‌క్లేవ్‌లో భాగంగా వివిధ పర్యాటక ప్రాజెక్టుల ఒప్పందాలు సీఎం సమక్షంలో జరిగాయి. 82 ప్రాజెక్టులకు సంబంధించి రూ.10,329 కోట్ల విలువైన ప్రాజెక్టులను పర్యాటక అభివృద్ధి సంస్థతో ఆయా సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. అనంతరం టూరిజం బ్రోచర్‌, కాఫీ టేబుల్‌ బుక్‌, పర్యాటక ఈవెంట్ల కేలండర్‌ను రామ్‌దేవ్‌తో కలిసి సీఎం విడుదల చేశారు. అంతకుముందు హోటల్‌ గదులుగా తీర్చిదిద్దిన టూరిజం క్యారవాన్లను సీఎం జెండా ఊపి ప్రారంభించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు