Homeఫీజులు ముద్దు… వసతులు అడగొద్దు !

ఫీజులు ముద్దు… వసతులు అడగొద్దు !

- Advertisement -

. ప్రెవేట్‌ పాఠశాలల్లో అరకొర మరుగుదొడ్లు
. కాలకృత్యాలకు విద్యార్థుల క్యూ
. ఆరోగ్యానికి ముప్పంటున్న వైద్యులు
. తల్లిదండ్రుల బలహీనతలు సొమ్ము చేసుకొంటున్న యాజమాన్యాలు

విశాలాంధ్ర – సచివాలయం : ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ … పోటీ ప్రపంచంలో అక్కడ రాణిస్తారో లేదోనన్న సందే హంతో ప్రైవేట్‌ పాఠశాలల వైపు తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. ఆ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తే భవిష్యత్తు బాగుంటుందని, గొప్ప వారు అవుతారని భావిస్తారు. ఇటువంటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకున్న కొన్ని ప్రైవేట్‌ సంస్థల యజమాన్యాలు ఆకర్షణీయమైన ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నాయి. వేలాది రూపాయల ఫీజులు గుంజుకుంటూ తగిన సౌకర్యాలు కల్పించకుండా పిల్లలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,232 ప్రైవేట్‌ పాఠశాలలో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. అందులో చాలా స్కూళ్లలో మరుగుదొడ్లు లేవు. మరికొన్ని పాఠశాలల్లో ఉన్నా విద్యార్థుల సంఖ్యకు అవి సరిపోవడం లేదు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి 10 నిముషాలు మాత్రమే కేటాయిస్తుండడంతో సమయం సరిపోక విద్యార్థులు మిన్నకుండిపోతున్నారు. ఇలాగే ఉంటే భవిష్యత్‌ లో తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని చిన్నపిల్లల వైద్యులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు లేకపోవడం, ఉన్నా వాటిని పరిశుభ్రంగా ఉంచకపోవడం వల్ల ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇంగ్లీష్‌పై మోజుతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఒక్కో ప్రైవేటు పాఠ శాలలో వందల సంఖ్యలో, కార్పొరేట్లో అయితే వేల సంఖ్యలో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పలు ప్రైవేటు పాఠశాలల్లో నామ మాత్రంగా ఒకటో, రెండో యూనిట్లు మాత్రమే ఏర్పాటుచేశారు. ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో సరిపడా మరుగుదొడ్లు లేకపోవడం కాలకృత్యాలు తీర్చుకోవడానికి క్యూలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మరికొన్ని పాఠశాలల్లో యాజమాన్యాలు మరుగుదొడ్లపై శ్రద్ద చూపకపోవడంతో అపరిశుభ్రంగా మారుతున్నాయి. దీంతో చాలా మంది విద్యార్థులు మరుగుదొడ్ల వైపు వెళ్లాలంటేనే అయిష్టత చూపుతున్నారు. యూరిన్‌కు వెళ్లకుండా బలవంతంగా బిగపట్టుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్లే సమయంలో బహిరంగ ప్రదేశాలలో మూత్ర విసర్జన చేస్తున్నారు. కొందరు పిల్లలు నీళ్లు తాగితే యూరిన్‌ కు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో అసలు నీళ్లు తాగడమే మానేస్తున్నారు. పిల్లలు ఇలా చేయడం వల్ల రోగాల బారిన పడాల్సి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో టాయ్‌లెట్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. అలా కాకుండా బిగబెట్టడం వల్ల మలబద్ధకం, యూరిన్‌ ఇన్ఫెక్షన్‌ వస్తుందని చెబుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. పాఠశాలల్లో తప్పనిసరిగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయ్లెట్‌ ఉండాలని, అలాగే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో 30 మంది విద్యార్థులకు ప్రత్యేకంగా రెండు మరుగుదొడ్లు ఉండాలి. పాఠశాలల్లో మౌలిక వసతులు, రిజిస్టర్లను, విద్యార్థుల సమస్యలను విద్యాశాఖ పరిశీలించాల్సి ఉంటుంది. రిజిస్టర్‌లో అక్కడి పరిస్థితిని నమోదు చేయాల్సి ఉంటుంది. తమ పిల్లల సమస్యలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియని అయోమయంలో తల్లిదండ్రులు ఉన్నారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలను విద్యాశాఖాధికారులు తనిఖీలు చేస్తే వాస్తవాలు బయటపడతాయని పలువురు అంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు