. మున్సి‘పోరు’లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్
. అభివద్ధి… సంక్షేమంపై విశ్వాసంతోనే ఎన్నికల్లో పట్టం
. ఫలితాలు విపక్షాలకు చెంపపెట్టు: భట్టి
విశాలాంధ్ర బ్యూరో -ఖమ్మం/మధిర: “రాష్ట్రంలో కాంగ్రెస్ పారదర్శక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన నమ్మకమే మున్సిపల్ ఎన్నికల విజయ రహస్యం” అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మధిరలో సోమవారం ఆయన మీడియా సమా వేశంలో మాట్లాడుతూ… “కాంగ్రెస్ కేవలం గ్రామీణ పార్టీయేనని, బురద చల్లిన వారికి ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 నుంచి 95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయ మని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటర్లు భారీ మెజారిటీని కట్టబెట్టారని, విజయం అందించిన ప్రతి ఓటరుకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం … ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. గడిచిన రెండేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రిమండలి సమిష్టిగా పనిచేస్తూ… అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమతూకంతో దూసుకుపోతూ, అర్బన్ సెంటర్లను అభివృద్ధి బాట పట్టించారని భట్టి పేర్కొన్నారు. తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని స్పష్టం చేశారు. మా పోటీ రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతోనే అన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పారిశ్రామికీకరణ ద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలు సృష్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం “ప్యూర్ – క్యూర్ – రేర” విధానంతో ముందుకు సాగుతున్నామన్నారు. పరిపాలనలో జవాబుదారీతనం పెంచడానికి… పౌరులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్యూర్ – క్యూర్ – రేర్ అని పేర్కొన్నారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే కొండ బాలకోటేశ్వర్ రావు, టీడీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రామనాథం, మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోన దనికుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటరమణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


