నేడు వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : నైరుతి రుతుపవనాలకు వాయుగుండం తోడైంది. ఇప్పటికే విస్తరించిన రుతుపవనాలతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడుగా ఇప్పుడు వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిరది. పారాదీప్‌నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇంక తీరం వెంట కోస్తా జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజుల పాటు వివిధ ప్రదేశాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ తెలిపారు. కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.


