పతకమూరు దామోదర ప్రసాద్
బీహార్ 18వ శాసనసభ 234 స్థానాలకు రెండువిడతలుగా జరుగుతున్న ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ నాయకత్వంలోని అధికార ఎన్డీఏ, రాహుల్, ఆర్జేడి నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాగట్బంధన్ హోరాహోరీగా తలడుతున్నాయి. నవంబర్ 6న తొలివిడతలో 121 స్థానాల ఎన్నికలకు సర్వం సిద్ధంకాగా, మలివిడత 122 స్థానాలకు ఈ నెల11న ఎన్నికలు జరుగనున్నాయి. గత 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ సారధ్యంలోనే ప్రస్తుతానికి ఎన్డీయే ఎన్నికలకు వెళుతుండగా, ప్రదాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభృతులు బీహార్ అంతటా కలియదిరిగి మహగట్బంధన్కు ఓటేస్తే 1990 నుంచి 1995 వరుకు సాగిన లాలూ, రబ్రీదేవి నాటి ఆటవిక పాలన, నేరాలు, ఘోరాలు మళ్లీ వస్తాయని, బీహార్ అంధ యుగాలలోకి వెళుతుందని, డబుల్ ఇంజిన్ సర్కార్ లాభాలు, సుపరిపాలన కావాలంటే మళ్లీ నితీశ్ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ, ఆర్జేడీ, ఎల్జేపి, హిందూస్తాన్ ఆవామీ మోర్చా, లోక్సుమతా పార్టీ పంచపాండవుల వలేె రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని హామీ ఇచ్చారు. కాగా రాహుల్, తేజస్వి నేతృత్వంలోని ప్రతిపక్ష మహాగట్బంధన్ కూడా ఈసారి ఎలాగయినా ఎన్డీయేను చిత్తుచేసి, బీహార్‌ను చేజిక్కించుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.
నితీశ్ వయోభారం, అనారోగ్యం వల్ల పాలన చేసే స్థితి లేదని, నేరాలు పెరుగుతున్నాయని, అందరి భాగస్వామ్యంతో బీహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలంటే యువకుడైన తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాగట్బంధన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. లాలు తొలిసారి ముఖ్యమంత్రి అయిన 1990 లో తేజస్వి పురిటి పొత్తిళ్లలోని నాలుగు నెలల పసికందుని, దిల్లీలో 9వ తరగతితో చదువుకు స్వస్తిచెప్పిన తేజస్వి 2020 ఎన్నికలలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి యువతను ఆకర్షించినా మహాగట్బంధన్ 110 స్థానాలకు పరిమితమైంది. ఆర్జేడీ 75 స్థానాలు గెలిచి పెద్దపార్టీగా నిలిచింది. మజ్లిస్ పార్టీ వేరుగా పోటీచేసి 6 స్థానాలు గెలిచి అనేక చోట్ల మహాగట్బంధన్ విజయావకాశాలు దెబ్బతీసింది. ఈ ఎన్నికలలో కూడా 30 స్థానాలకు పోటీకి దిగింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే రాష్ట్రమంతా చుట్టేశారు. తానుపోటీ చేయకుండా జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపారు. ఒక్కసీటు గెలిచే వీలున్నా బహుముఖ పోటీల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలు దెబ్బతీయగలరని అంటున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2005 నుంచి మహిళా సంక్షేమానికి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ, పంచాయతీరాజ్, పురపాలక సంఘాల అధ్యక్ష స్థానాలలో రిజర్వేషన్లు కల్పించి వారి మన్ననలు చూరగొన్నారు. మహా దళితులకు, 36 శాతం ఉన్న అత్యంత వెనుకబడిన(ఈబీసీి) వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 15శాతం ఓటు బ్యాంకును స్థిరపరచుకున్నారు. బీజేపీకి అగ్రవర్ణాలు తదితరులతో కలిసి దాదాపు 20శాతం ఓట్లున్నాయి. వీరికి తోడు హిందూస్తాన్ ఆవామీ మోర్చా దళిత ఓట్లు, లోక్ సమతా పార్టీ ఓట్లతో కలిపి దాదాపు 38 శాతం ఓట్లున్నాయి. మహాగట్బంధన్కు బలమైన యాదవ, ముస్లిం(14శాతం,17శాతం) 32 శాతం ఓట్లున్నాయి. అయితే అధికారానికి ఈ ఓట్లు చాలవని గుర్తించి తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికల ముందు ఎన్డీయేను వీడిన వీఐపీ నేత ముఖేశ్ సహానీకి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించి ప్రచార సభలకు వెంట బెట్టుకు వెళుతున్నారు. ఓటర్లలో 4.5 శాతం మత్స్యకారులున్నారు. వారిలో మళ్లీ ఉపకులానికి 2.6 శాతం ఓట్లున్నాయి.
గత ఎన్నికల్లో మరో 12 స్థానాలు గెలిచి ఉంటే తేజస్వీకి ముఖ్యమంత్రి పీఠందక్కేది. సీమాంచల్‌లో మజ్లీస్ పార్టీ మహాగట్బంధన్ను దెబ్బతీసింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మహాగట్బంధన్కు 37.23 శాతం ఓట్లు రాగా, ఎన్డీఏకు 37.26 శాతం అంటే కేవలం 12,700 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. బీహార్‌లో దాదాపు 20 శాతం దళితులున్నారు. మహా దళితులు, చిరాగ్ పాశ్వాన్ ఎన్డీయేకు మద్దతుగా ఉన్నారు. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద దాదాపు కోటిన్నర మంది మహిళలు ఒక్కొక్కరి ఖాతాలో రూ20 వేలు జమచేసి, మెరుగైన ప్రతిభ కనబరచిన వారికి రూ2 లక్షల వరకు రుణాలిస్తామని నితీశ్ ప్రభుత్వం వారిని బట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మహిళల ప్రాధాన్యత గుర్తించిన తేజస్వీి మహాగట్బంధన్ అధికారంలోకి వస్తే ఒక్కో మహిళ ఖాతాలో నెలనెలా రూ2500 జమచేస్తామని, సంక్రాంతి పండుగకు రూ30 వేలిస్తామని, ఇంటికో ఉద్యోగం ఖచ్చితంగా ఇస్తామని పోటీ హామీలిచ్చి అధికార కూటమిలో గుబులు రేపారు. అత్యంత వెనకబడిన వర్గాలలోని 112 ఉపకులాల వారు 120 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయనున్నారు. 10వేలకంటే తక్కువ మెజారిటీతో పార్టీలు గెలిచిన స్థానాలు 50. హిల్సా నియోజకర్గంలో ఆర్జేడి అభ్యర్థిపై జేడీయూ అభ్యర్థి కేవలం 12 ఓట్లతో గెలిచారు. బర్భిగా స్థానంలో విజేత మెజార్టీ 113. 10 స్థానాలలో అభ్యర్థులు వెయ్యి ఓట్లలోపు మెజారిటీతో గెలిచారు. రాహుల్ ఓట్ చోరీ యాత్ర చేసినా 47లక్షల మంది పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేరలేదు. వీరిలో 16 లక్షల మంది మహిళలు, ఈబీసీలు దళితులే. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి జేడీయూపై కత్తిగట్టిన చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ ఈసారి అధికార కూటమిలో చేరగా, గతంలో ఎన్డీయేలో ఉన్న ముకేశ్ సహానీ ఈసారి మహాగట్‌బంధన్‌తో జట్టు కట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కులాలు, ఉపకులాల ప్రాబల్యం, ఆ చైతన్యం ఎక్కువగా ఉన్న బీహార్‌లో పార్టీలు ఓట్ల కోసం అలవిగాని హామీలిచ్చాయి. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలంటే మరో కోటికి పైగా ఉద్యోగాల కల్పనకు రూ6లక్షల కోట్లు అవసర మంటున్నారు. ఇంటికి 200యూనిట్ల విద్యుత్‌కు భారీగా నిధులు కావాలి. యువత, మహిళలను అకట్టుకుని అధికారంలోకి రావాలని యువకు డైన తేజస్వీి ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికలలో మళ్లీ గెలిచి ఉత్తరాదిలో సత్తాచాటాలని మోదీ యత్నం. తేజస్వి తేజస్సు వెలుగుతుందా లేక మోదీ, నితీశ్ ప్రభావం కొనసాగుతుందా అనేది 7.45కోట్ల బీహార్ ఓటర్లు తేల్చనున్నారు.
సీనియర్ జర్నలిస్టు,
సెల్: 9440990381


