Homeవిశ్లేషణబ్యాంకుల ప్రైవేటీకరణ వైపేకేంద్రం మొగ్గు

బ్యాంకుల ప్రైవేటీకరణ వైపేకేంద్రం మొగ్గు

- Advertisement -

గోపాలుని రాధాకృష్ణ

కేంద్రంలో ప్రధాని మోదీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ప్రభుత్వరంగ బ్యాంకులను ఒక పథకం ప్రకారం ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పచెప్పే పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉన్నత పదవిలో ఉన్న వారి నియామకాల్లో ప్రైవేటు రంగం నుంచి తీసుకునేలా ఇటీవల ఆదేశాలు జారీ చేయడం కూడా తెలిసిందే. మరోవైపు విలీనాలంటూ ఆర్థికశాఖ మంత్రి భారతీయ రిజర్వుబ్యాంకుతో, సంబంధిత బ్యాంకు అధికారులతో చర్చలు జరపటం చూస్తుంటే త్వరలో బ్యాంకింగ్‌ రంగంలో తీవ్ర మార్పులు తెచ్చేలా అడుగులు పడుతున్నాయి. అంతేకాక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 శాతానికి పెంచేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వైఖరి చూస్తుంటే కేంద్రం ఒకే జాతి, ఒకే బ్యాంకు అనే నినాదంతో ముందుకు పోయేలా ఉంది. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్‌రంగ బ్యాంకులకు పెద్దపీట వేస్తున్నట్లుగా ఉందని అనేక మంది ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. ఆర్థిక సంస్కరణలో ఇది ఒక భాగమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఇంతకు మునుపే కేంద్రంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం బీజం నాటిందని చెప్పవచ్చు. ప్రస్తుతం భారత్‌ సహా ప్రపంచంలోని అనేక దేశాలు అమెరికా విధించిన సుంకాల విషయంలో ఇబ్బడిముబ్బడిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల విషయంలో దుందుడుకు చర్యలు పట్ల అనేక మంది నిపుణులు తమ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఐదు దశాబ్దాల క్రితం ఆనాడు ఉద్యోగుల పోరాటాలు ఒకవైపు, వామపక్ష ఉద్యమాలు మరోవైపు వంటి అనేక రకాల ఒత్తిళ్లతో ఆనాడు ఇందిరాగాంధీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రైవేటు బ్యాంకుల జాతీయకరణకు తలొగ్గింది. దీని ఫలితమే 1969 జులై 14న ప్రైవేటురంగ బ్యాంకులను జాతీయం చేస్తూ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. అనంతరం జరిగిన పరిణామాలను గమనిస్తే, పాలకుల అసమర్ధ, ఆర్థిక విధానాలతో తిరిగి ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుందా అన్న అనుమానం రాక తప్పదు. ప్రధానంగా సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించేందుకు, సంపన్న వర్గాలకే పరిమితమైన బ్యాంకింగ్‌ రంగం సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు ఈ విధానం దోహదపడిరది. అది ఒక చరిత్రాత్మక నిర్ణయం. 14 ప్రైవేట్‌రంగ బ్యాంకుల జాతీయకరణతో బ్యాంకింగ్‌ ముఖ చిత్రమే మారిపోయింది. అంతేకాక ఆనాటి సోషలిస్టు విధానాలు కూడా జాతీయకరణకు దోహదపడ్డాయి. అయితే గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా పాలకులు ఈ రంగం పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారు. అంతేకాకుండా బ్యాంకింగ్‌ రంగం లక్ష్యాలను నీరు కారుస్తూ, ఈ రంగాన్ని పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పాలన్న దురుద్దేశంతో ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగ సంఘాలను పరిగణనలోనికి తీసుకోకుండా, నియంతృత్వ ధోరణితో ముందుకు వెళ్తున్నారు. ప్రజల సొమ్మును కొంతమంది వ్యక్తులకి ధారాదత్తం చేస్తున్నారు. జాతీయకరణకు తూట్లు పొడుస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖలను మూసివేసి, వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూస్తున్నారు. ఆనాటి వామపక్ష పార్టీలు పార్లమెంటు లోపల, ఉద్యోగ, కార్మిక సంఘాలు పార్లమెంట్‌ వెలుపల అనేక పోరాటాలు, ఆందోళన కార్యక్రమంలో నిర్వహించాయి. అనేక ఒడిదుడుకులు, న్యాయపరమైన చిక్కులు మరోవైపు, ఆనాటి ఆర్థిక మంత్రి మొరార్జీదేశాయ్‌ జాతీయకరణను వ్యతిరేకిస్తూ రాజీనామా చేయడం, వీటన్నిటినీ అధిగమించి ఇందిరాగాంధీ ఎంతో సాహసంతో ముందుకు పోవడం అనేది గొప్ప విషయంగా పేర్కొనవచ్చు. అంతేగాక అటువంటి కీలక సమయంలో తానే ఆర్థిక మంత్రిగా ఉండి, 14 ప్రధాన వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం అనేది చరిత్రలో చెరగని అధ్యాయంగా మిగిలింది.
కోవిడ్‌ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో బ్యాంకులు సంక్షోభంలో కూరుకుపోయినా కూడా మన బ్యాంకింగ్‌ రంగం నిలదొక్కుకోగలిగిందంటే ఆనాడు జాతీయకరణకు వేసిన పునాదులే కారణం. ఇందిరాగాంధీ అనంతరం అధికారం చేపట్టిన ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌, మొరార్జీ దేశాయి, చంద్రశేఖర్‌ తదితరులు సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అంటూ ముందుకు సాగిన సంగతి తెలిసిందే. అయితే 1991 నుంచి ప్రైవేటీకరణ యత్నాలు అనేక రాజకీయ కారణాల వల్ల వెనుకబడ్డా 2014లో మోదీ నాయకత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఊపందుకున్నాయి. దేశంలో అనేక ప్రైవేట్‌ బ్యాంకులు అనేక రకాల సంక్షోభాల్లో కూరుకుపోవటం, సాధారణ డిపాజిట్‌దారులు నష్టపోవడం మనం చూశాం. ఈనాడు బ్యాంకింగ్‌రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. 2017 నవంబర్‌ 8న ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఈ రంగాన్ని మరింత కృంగ తీసింది. ఏదేమైనా కేంద్రం దూకుడు ఆగేలా లేదు. తదుపరి చర్యలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
మొబైల్‌ నెంబర్‌ 9885390232,

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు