పెట్రోలుపై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 భారం
బతకలేని స్థితిలో సామాన్యులు
న్యూదిల్లీ: పెట్రో ధరల బాదుడు కొనసాగుతోంది. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెట్రో ధరలు పెంచేది లేదని పదేపదే ఊదరగొట్టిన బీజేపీ, మోదీ సర్కారు…ఎన్నికలు ముగిసిన తర్వాత బాదుడే బాదుడంటూ ధరలు భారీగా పెంచుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధాన్ని సాకుగా చూపుతూ కొద్దిరోజుల్లోనే ఏకంగా నాలుగుసార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచారు. దేశంలో పెట్రో ధరల బాదుడు కొనసాగుతోంది. కేంద్రంలోని మోదీ సర్కార్ రెండు వారాల లోపే ప్రజలపై మోయలేని భారం మోపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) సోమవారం పెట్రోల్ ధర లీటరుకు రూ.2.61, డీజిల్ ధర లీటరు రూ.2.71 పెంచాయి. రెండు వారాల కంటే తక్కువ వ్యవధిలో ధరల పెంపు జరగడం ఇది నాలుగోసారి. ఈ తాజా సవరణతో సుదీర్ఘకాలం పాటు నిలిచిపోయిన ధరల సవరణ మే 15న తిరిగి ప్రారంభమైనప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలలో మొత్తం పెరుగుదల లీటరుకు దాదాపు రూ.7.50 కు చేరింది. దిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.99.51 నుంచి రూ.102.12కు అంటే… రూ.2.61 పెరిగింది. అదే సమయంలో డీజిల్ ధరలు లీటరుకు రూ.92.49 నుంచి రూ.95.20కు అంటే రూ.2.71 పెరిగాయి. సవరించిన ఈ ధరలు శనివారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ పెంపు చోటుచేసుకున్నట్లు చమురు కంపెనీలు చెబుతున్నాయి. హోర్ముజ్ జలసంధిలో నెలల తరబడి కొనసాగుతున్న దిగ్బంధం, అంతరాయాలు ఇంధన రవాణాపై తీవ్ర ఒత్తిడి సృష్టించాయి. పశ్చిమాసియా సంఘర్షణ ప్రభావం గురించి ఓఎన్‌జీసీ డైరెక్టర్ (ఎక్స్‌ప్లోరేషన్) సుష్మా రావత్ మాట్లాడుతూ ఈ సంఘర్షణపై నెలకొన్న అనిశ్చితి మధ్య ముడి చమురు ధరలు అత్యంత అస్థిరంగా ఉన్నాయని తెలిపారు. ‘శాంతి ఒప్పందం కుదిరిందని ప్రకటన వచ్చినప్ప్పుడల్లా ముడి చమురు ధరలు తగ్గడం మొదలవుతాయి. ఇక పరిష్కారం లేదని గ్రహించినప్ప్పుడు ధరలు మళ్లీ పెరుగుతాయి’ అని రావత్ ఏఎనఐకి చెప్పారు.
ఏపీలో పెట్రోల్ ధర లీటరు రూ.117
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. విజయవాడలో పెట్రోల్ ధర ఇప్ప్పుడు లీటరుకు రూ.117.19గా, డీజిల్ ధర రూ.104.88 గా ఉంది. గుంటూరులో పెట్రోల్ ధర రూ.117.59గా, డీజిల్ ధర లీటరుకు రూ.105.28గా నమోదయ్యాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటరుకు రూ.115.58 చొప్ప్పున, డీజిల్ రూ.103.74 చొప్ప్పున విక్రయాలు జరుగుతున్నాయి.


