దక్షిణ ఇరాన్‌లో అమెరికా విధ్వంసం
. క్షిపణి స్థావరాలు, మైన్ల నౌకలపై బాంబులు
. కాల్పుల విరమణ`శాంతి చర్చల వేళ పోరు
. లెబనాన్‌లో ఇజ్రాయిల్ వైమానిక దాడులు
వాషింగ్టన్/తెహ్రాన్: పశ్చిమాసియా శాంతి ప్రశ్నార్థకంగా మారింది. ఏడు వారాలుగా సాగుతున్న కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ అమెరికా భీకర దాడులకు దిగింది. హోర్మూజ్ జల సంధి సమీపంలోని వ్యూహాత్మక హబ్‌గా పరిగణించే దక్షిణ పోర్టు సిటీ బందర్ అబ్బాస్ సహా అనే ప్రాంతాల్లో సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. క్షిపణి కేంద్రాలు, మైన్లు పరిచే నౌకలపై దాడులు చేసింది. అయితే యుద్ధం మొదలైన 88వ రోజు ఇరాన్‌పై అమెరికా సైన్యం విరుచుకుపడ్డాయి. కాల్పుల విరమణ అమల్లో ఉండి, ఖతార్‌లో శాంతి చర్చలు జరుతున్న వేళ దక్షిణ ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఇదంతా ఆత్మరక్షణలో భాగమని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి టిమోతీ హాకిన్స్ పేర్కొన్నారు. సముద్రంలో మైన్స్ పరిచే బోట్లT ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. క్షిపణి కేంద్రాలు పేల్చివేశామన్నారు. తమ దేశానికి చెందిన రెండు విమాన వాహక నౌకలు, రెండు డజన్లకు పైగా యుద్ధ నౌకలకు తీరం వెంట ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలతో ముప్ప్పుగా పరిగణించినట్లు వెల్లడించారు. బందర్ అబ్బాస్ పోర్టులోని నావికా దళ శిబిరం ధ్వంసమైనట్లు తెలిపారు. ఈ దాడుల్లో లర్క్ ద్వీపంలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే ఇజ్రాయిల్ దళాలతో కలిసి అమెరికా తాజా దాడులు చేసినట్లు తెలుస్తోంది. అటు లెబనాన్‌పై ఇజ్రాయిల్ విరుచుకుపడింది. హెజ్బుల్లా కేంద్రాలపై కనీసం 70 దాడులు చేసింది. అదే సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని హె²జ్బుల్లా అతిక్రమించినట్లు ఆరోపించింది. దక్షిణ లెబనాన్‌లోని నబాతియా పట్టణ వాసులను ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు చేసింది. అక్కడ వైమానిక దాడులు చేపట్టింది. తూర్పు లెబనాన్‌లోని బెక్కా లోయ గ్రామంలో జరిపిన వైమానిక దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌లో హెజ్బుల్లాపై దాడులను తీవ్రతరం చేస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించిన విషయం విదితమే.
ఎంక్యూ9 డ్రోన్లు కూల్చేశాం: ఐఆర్‌జీసీ అమెరికా ద్వారా జరిగే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు ప్రతిస్పందించే చట్టబద్ధమైన నిశ్చయమైన హక్కు ఇరాన్‌కు ఉందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) ఒక ప్రకటనలో తెలిపింది. తమ దళం అమెరికా ఎంక్యూ`9 డ్రోన్‌ను కూల్చినట్లు పేర్కొంది. ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన యుద్ధ విమానంపై దాడి చేసినట్లు వెల్లడించింది. అమెరికాకు చెందిన ఆర్‌క్యూ4 డ్రోన్, ఎఫ్35 యుద్ధ విమానం గల్ఫ్ ప్రాంతం గుండా ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి ఆపై వెనక్కి వెళ్లిపోయినట్లు ఐఆర్‌జీసీ పేర్కొంది.
దీటుగా బదులిస్తాం: ఇరాన్
తాజా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఉల్లంఘనలకు పాల్పడిందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఏడు వారాలుగా సాగుతున్న కాల్పుల విరమణ కసరత్తుకు తీవ్రంగా తూట్లు పొడిచినట్లు విమర్శించింది. దాడులకు తీవ్ర ప్రతిఘటన తప్పబోదని, ఆత్మరక్షణకు ఇరాన్ వెనుకాడదని తేల్చిచెప్పింది. ‘అమెరికా తీవ్రస్థాయిలో కాల్పుల విరమణకు పాల్పడింది. గత 48 గంటల్లో హోర్మోజన్ ప్రాంతంలో కాల్పుల విరమణను ఉల్లంఘించింది. అనుచిత, దూకుడు చర్యలకు బాధ్యులైన అమెరికా యంత్రాంగంతో ఇరాన్ చర్చలు జరుపుతోంది’ అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటన పేర్కొంది.
ఇప్ప్పుడప్ప్పుడే ఒప్పందం జరగదు: రూబియో
ఇరాన్‌తో ఏకాభిప్రాయానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. అమెరికా తాజా దాడులు జరపడాన్ని ఆయన సమర్థించుకున్నారు. హోర్మూజ్ జల సంధిని ఏదో విధంగా తెరిపిస్తామన్నారు.
చైనా శాంతి పిలుపు
కాల్పుల విరమణకు కట్టుబడాలంటూ అమెరికా, ఇరాన్‌కు చైనా పిలుపునిచ్చింది. శాంతియుతంగా వివాదాలు పరిష్కరించుకోవాలని సూచించింది. సాధ్యమైనంత త్వరగా శాంతి స్థాపనను కోరింది. తాజా దాడుల క్రమంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.


