జి.సత్యనారాయణరాజు
ఉరుమురిమి మంగలం మీద పడిందని సామెత.. ఇప్సుడు ప్రపంచంలో ఏం జరిగినా దాని ప్రభావం భారతదేశంపై పడుతోంది. పశ్చిమాసియా సంక్షోభం ముగిసినట్టే అని అంతా భావించారు. అయితే తాజా పరిణామాలతో సామాన్య జనం హడలిపోతున్నారు. హోర్మూజ్ జలసంధిలో పెరుగుతున్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, గ్యాస్ ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక సంధి విచ్ఛిన్నం కావడంతో, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ఈ వ్యూహాత్మక సముద్ర మార్గాన్ని తదుపరి నోటీసు వచ్చే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగే ముప్పు ఏర్పడింది. అమెరికా దాడులు, ఒత్తిళ్లకు నిరసనగా ఇరాన్ హోర్మూజ్ జలసంధిని మూసివేసింది. కేవలం తమ నిబంధనల ప్రకారమే దీనిని తిరిగి తెరుస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న వాణిజ్య చమురు ట్యాంకర్లపై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడులు జరగడంతో ఆందోళనను మరింత పెంచింది. దీంతో ఈ మార్గంలో నౌకల రాకపోకలు ఐదు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ముప్పును తిప్పికొడుతూ అప్రమత్తమయ్యాయి. గ్యాస్, చమురు ధరలపై చూపే ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో దాదాపు ఐదో వంతు, భారీ మొత్తంలో ద్రవీకృత సహజ వాయువు , ఎల్‌పీజీ ఎగుమతులు ఈ హోర్మూజ్ గుండానే సాగుతాయి. ఈ తాజా సంక్షోభం వల్ల ధరల పెరుగుదల తప్పకపోవచ్చనే సంకేతాలు వ్యక్తం అవుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఇప్పటికే ఒకేసారి 3శాతం పైగా పెరిగి, బ్యారెల్‌కు 95 డాలర్లకు చేరింది. సముద్ర మార్గాల్లో రిస్క్క పెరగడం వల్ల నౌకల బీమా, రవాణా ఛార్జీలు రోజుకు భారీగా పెరిగాయి. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. హోర్మూజ్ సంక్షోభం సుదీర్ఘకాలం కొనసాగితే భారత్‌కు అనేక ఇబ్బందులు తప్పవంటున్నారు. దేశీయంగా ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరాకు ఆటంకం కలిగి, ఇంట్లో వాడే వంట గ్యాస్ సిలిండర్ ధరలు, రవాణా ఖర్చులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. అంతర్జాతీయంగా చమురు ధర ప్రతి ఒక డాలర్ పెరిగితే, భారత్ వార్షిక చమురు దిగుమతి బిల్లు దాదాపు 2 బిలియన్ డాలర్ల వరకు పెరుగుతుంది. ఇరాక్, కువైట్ వంటి దేశాల నుంచి రావాల్సిన చమురు నౌకలు పూర్తిగా హోర్మూజ్ పైనే ఆధారపడటం వల్ల భారత మార్కెట్‌లకు సరఫరా ఆలస్యం జరుగుతోంది. అంతర్జాతీయ సంక్షోభం కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్‌లు (సెన్సెక్స్, నిఫ్టీ) కూడా ఇప్పటికే భారీ నష్టాలను చవిచూశాయి. ప్రపంచవ్యాప్త చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి సంక్షోభానికి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న వైరుధ్యాలే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అగ్రరాజ్యం ఆధిపత్యం, ఆంక్షలను ఇరాన్ వ్యతిరేకించగా, ఇరాన్ దుందుడుకు చర్యలను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు నిలువరించడం ఈ ఉద్రిక్తతలకు దారితీసింది. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుంచి ఉపశమనం పొందడానికి, తన అణు కార్యక్రమాలను కాపాడుకోవడానికి ఇరాన్ ప్రయత్నిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ హోర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించి, వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడటంతో వివాదం మరింతగా ముదిరింది. జలసంధిలో ఇరాన్ నియంత్రణను అమెరికా బలగాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. వాణిజ్య నౌకలపై దాడులకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం ఇరాన్‌లోని స్థావరాలపై వైమానిక దాడులు జరుపుతోంది. డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ ధరలు కూడా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరాలకు తీవ్ర అంతరాయం కలగడంతో భారత్‌లో వంట గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లతో చమురు సంస్థలు ధరలు పెంచుతూనే ఉన్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగితే సిలిండర్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. యుద్ద ప్రభావంతో మార్చి నుంచి గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తలు తగ్గడంతో గత నెలలో ధరలు కాస్త తగ్గాయి. కానీ పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టేందుకు సిద్దమవుతోంది.
- సీనియర్ జర్నలిస్ట్, 9030880709


