ఎడతెరపి లేని వాన… స్థంభించిన జనజీవనం
. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు
. కాట్రేనికోనలో 121, రావులపాలెంలో 92 మిమీ వర్షపాతం
. రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ
. దుబాయ్ నుంచి సమీక్షించిన సీఎం చంద్రబాబు
. తక్షణ సహాయంగా జిల్లాకు రూ.2 కోట్లు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ఎడతెరపిలేని వర్షంతో రాష్ట్రం అతలాకుతలమైంది. నగరాలు, పట్టణాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు ప్రవేశించింది. జనజీవనం స్థంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల్లో విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. యూఏఈ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు దుబాయ్ నుంచే వరద పరిస్థితులపై సమీక్షించారు. తక్షణ సహాయంగా కొన్ని జిల్లాలకు రూ.2 కోట్లు, మరికొన్ని జిల్లాలకు కోటి చొప్పున నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. అండమాన్ సముద్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలతో పాటు యానాంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం సాయంత్రం 6 గంటల నాటికి కోనసీమ(జి) కాట్రేనికోనలో 120.5 మిమీ, రావులపాలెంలో 92.2 మిమీ, ముమ్మిడివరంలో 90.7 మిమీ, పశ్చిమగోదావరి(జి) నర్సాపురంలో 85.5 మిమీ, కోనసీమ(జి) గంగవరంలో 83.7 మిమీ, ముక్కామలలో 79.7 మిమీ, నెల్లూరు(జి) రాపూర్‌లో 78.5 మిమీ, కోనసీమ(జి) మలికీపురంలో 76.2 మిమీ, కాకినాడ(జి) కోటనందూరులో 76 మిమీ వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ వెల్లడిరచారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షానికి పెన్నానదిలో వరద ప్రవాహ ఉధృతి పెరిగింది. నెల్లూరు జిల్లా చేజెర్ల మండలం యనమదల వద్ద నల్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మర్రిపాడు మండలం బొగ్గేరు, సైదాపురం మండలం పిన్నేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పొదలకూరు మండలంలో నావూరు, పెదవాగుతోపాటు గుడ్లూరు-తెట్టు మధ్య రాళ్ల వాగు ఉద్ధృతితో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది.
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడాలి: సీఎం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షప్రభావిత జిల్లాలు నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య తదితర జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీవర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు రూ.కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కడప, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను, నెల్లూరు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణం మోహరించాలని ముఖ్యమంత్రి సూచనలిచ్చారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, రహదారులు, భవనాలు, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. భారీ వర్షాలతో నీట మునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, పిల్లలకు పాలు లాంటి ఆహారపదార్ధాలను అందుబాటులో ఉంచాలన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. తీవ్ర వర్షాల కారణంగా కాలువ, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్టపరచాలని సీఎం అధికారులకు సూచనలు ఇచ్చారు. అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. పంట నష్టం జరక్కుండా చూడాలని సీఎం సూచనలిచ్చారు.
మరోపక్క సీఎం ఆదేశాలతో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి, జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సహాయకచర్యలపై సమీక్షించారు. మండల కంట్రోల్ రూమ్స్‌లో రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్, విద్యుత్ శాఖ అధికారులను ఉంచాలని, తద్వారా సమస్యలు ఏర్పడితే త్వరితగతిన పరిష్కరించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈ వారం రోజులు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా గండ్లు పడే అవకాశముంటే ఇసుక బస్తాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ప్రమాదకర పరిస్థితులు రాకముందే పునరావాస కేంద్రాలకు తరలించాలని, క్షేత్రస్థాయి వరద తీవ్రత ఉన్న ప్రాంతాల్లో ఫొటోలు, వీడియోల ద్వారా రిపోర్టు పంపాలని మంత్రులు ఆదేశించారు.


