. కేసీఆర్ విమర్శ
. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుపై దీమా
విశాలాంధ్ర-హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ దుష్టపాలన సాగిస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. నమ్మించి మోసం చేయడం ఈ ప్రభుత్వానికి పరిపాటైందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున మాగంటి సునీత గోపీనాథ్ తప్పక గెలుస్తారని దీమాగా చెప్పారు. కాంగ్రెస్ దుష్ట పాలనపై రాష్ట్ర ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీ సాధించేలా కృషి చేయాలన్నారు. జూబ్లీహిల్స్ నియోజ కవర్గ ఉప ఎన్నికల దృష్ట్యా మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు లక్ష్యంగా, కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో సన్నాహక సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్ర గుల్లయ్యిం దన్నారు. రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితుల గురించి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూచించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి` సంక్షేమంపై ప్రచారం చేయాలన్నారు. నాటి పథకాలు కాంగ్రెస్ పాలనలో ఎందుకు మాయమయ్యాయో ప్రజలతో చర్చించాలని సూచించారు. జూబ్లీ హిల్స్‌లో రౌడీషీటర్‌ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిరచి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని, హైదరాబాద్‌లో శాంతి భద్రతలను ప్రజలు కాపాడుకుంటారన్న నమ్మకం తనకు ఉన్నదని కేసీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాంశాలపై ఇన్చార్జీలు ఆయనకు నివేదించారు. మాగంటి సునీత భారీ మెజారిటీతో గెలుస్తారనే సంకేతాలు ఉన్నాయన్నారు. అందుకోసం అనుసరించే వ్యూహాలు ఎత్తుగడలు, కార్యాచరణను వివరించారు. కేసీఆర్ అన్ని అంశాలను సమీక్షించి వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేతలు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు జూబ్లీహిల్స్ పరిధి డివిజన్ల, క్లస్టర్ల ఇన్చార్జులు పాల్గొన్నారు.


