- దిల్లీ హైకోర్టులో పిల్… నేడు విచారణ
- మీ వైఖరి తెలపాలంటూ దిల్లీ ప్రభుత్వం, కేంద్రానికి కోర్టు నోటీసు
న్యూదిల్లీ : నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దిల్లీ హైకోర్టు స్పందించింది. వాంగ్‌చుక్ విషయంలో కేంద్రం, దిల్లీ ప్రభుత్వం తమ వైఖరిని తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) భారీ నిరసన చేపట్టింది. సీజేపీ ధర్నాకు మద్దతుగా వాంగ్‌చుక్ జూన్ 28 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. కాగా, వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత క్ష్మీణించడంతో ఆయన రెండు రోజుల్లో చనిపోయే ప్రమాదం ఉందని, వెంటనే జోక్యం చేసుకుని ఆయనను రక్షించాలంటూ దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం పిటిషనర్ వాదనలు విన్న అనంతరం అత్యవసరతను గుర్తించింది. అదనపు సొలిసిటర్ జనరల్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం, దిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా ప్రతివాదుల తరఫున ఎలాంటి న్యాయవాది హాజరుకాలేదని ధర్మాసనం నమోదు చేసింది. జిల్లా కోర్టుల ఆర్థిక అధికార పరిధి పెంపును వ్యతిరేకిస్తూ దిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఇచ్చిన బహిష్కరణ పిలుపు కారణంగా న్యాయవాదులు కోర్టు కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని పేర్కొంది. దీంతో ప్రభుత్వ తరఫున కూడా ఎలాంటి న్యాయాధికారి కోర్టుకు హాజరు కాలేకపోయారని వెల్లడించింది. కేసును గురువారం మరోసారి విచారించనున్నట్లు పేర్కొంది.
వైద్య చికిత్సతో పాటు చర్చలు జరపాలని పిటిషన్
వాంగ్‌చుక్‌కు తక్షణమే అవసరమైన వైద్య చికిత్స, ప్రాణరక్షక సేవలు అందించాలని కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అలాగే ఆయన చేపట్టిన నిరసనలో లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వాలు చర్చలు ప్రారంభించేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర వైద్యం, పోషకాహార సహాయం సహా అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించి ఆయన ప్రాణాలను కాపాడాలని పిల్లో పేర్కొన్నారు. నిరాహార దీక్ష ప్రారంభించినప్పటి నుంచి సోనం వాంగ్‌చుక్ సుమారు 8.25 కిలోల బరువు కోల్పోయారని పేర్కొన్నారు. తరచూ రక్తంలో చక్కెర స్థాయులు తగ్గడం, తలతిరగడం, తీవ్ర నీరసం, కండరాల బలహీనత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు.
మోదీ మొండితనం వీడాలి: వాంగ్‌చుక్
‘మనం దీక్ష చేసినంత మాత్రాన కేంద్రం దిగి రాదు… విద్యా మంత్రి రాజీనామా చేసేయరు. కానీ అందుకు మనం ఆశిద్దాం. అయితే ఈ పోరాటం ప్రజలను మేల్కొల్పుతుంది. దీంతో మన ఉద్దేశం నెరవేరుతుంది. ఒకరి రాజీనామాతో ఒరిగేది ఏమీ లేదు. ప్రభుత్వంలోని ప్రతి శాఖలో సంస్కరణలు జరగాలి’ అని జంతర్ మంతర్ వేదికపై నుంచి వాంగ్‌చుక్ నీరసంగా మాట్లాడారు. చర్చలు లేకుండా దీక్ష విరమించే ప్రసక్తే లేదని చెప్పారు. శరీరం సహకరించకపోయినా మనోధైర్యంతో ముందుకెళుతున్నట్లు వెల్లడించారు. కేంద్రం చర్చలకు ముందుకు రావల్సిందేనన్నారు. సీజేపీకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, విద్యార్థుల కోసమే పోరాడుతోందని వాంగ్‌చుక్ చెప్పారు. సానుభూతి, కరుణ వంటి ఆధారంగానే ప్రజాస్వామ్యం నడుస్తుంది తప్ప కఠిన వైఖరితో కాదని… ప్రధాని మోదీ కూడా సున్నితత్వంతో వ్యవహరించాలని, మొండితనాన్ని వీడాలన్నారు. తాను మోదీని కలవలేదని చెప్పారు.


