దేశీయ వంటగ్యాస్ వినియోగదారులు తమ ఎల్‌పీజీ కనెక్షన్‌కు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ (ఈ-కేవైసీ) పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించారు. తాజాగా సెప్టెంబరు 14 వరకు అవకాశం కల్పించారు. ప్రముఖ చమురు మార్కెటింగ్ సంస్థ (ఓఎంసీ)కు చెందిన ఓ సీనియర్ అధికారి ఈ విషయాన్ని ‘ది హిందూ’కు ధ్రువీకరించారు.
ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే సిలిండర్ సరఫరా ఎలా?
ఇప్పటికీ ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు సిలిండర్ల సరఫరా ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ-కేవైసీ కోసం గడువును పదేపదే పొడిగిస్తుండటం చూస్తే వీలైనంత ఎక్కువ మంది వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే ప్రతి కనెక్షన్‌కు 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేయించడం సాధ్యంకాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా కొందరి వద్ద ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉండటం, మరికొన్ని కనెక్షన్లు ఇతరుల పేర్లపై నమోదై ఉండటం ఇందుకు కారణంగా చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రీఫిల్ బుకింగ్‌కు గడువు తగ్గింపు
మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఊరటనిచ్చింది.ఒకసారి సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరో రీఫిల్ బుక్ చేసుకునేందుకు ప్రస్తుతం ఉన్న 45 రోజుల గడువును 25 రోజులకు తగ్గించాలని చమురు మార్కెటింగ్ సంస్థలను ఆదేశించింది.దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లో ఉన్న విధంగానే తక్కువ వ్యవధిలో మరో సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం లభించనుంది.
మెరుగుపడిన సరఫరా పరిస్థితులతో మార్పు
పశ్చిమాసియా సంక్షోభం సమయంలో ఎల్‌పీజీకి డిమాండ్ పెరగడంతో సరఫరాను నిర్వహించేందుకు రెండు బుకింగ్‌ల మధ్య 45 రోజుల విరామాన్ని అమలు చేశారు.ప్రస్తుతం ఎల్‌పీజీ సరఫరా పరిస్థితులు మెరుగుపడటంతో పాటు రీఫిల్ కోసం వేచి ఉన్న వారి సంఖ్య కూడా తగ్గింది.దీంతో గ్రామీణ వినియోగదారులకు ఉన్న 45 రోజుల గడువును 25 రోజులకు తగ్గించే నిర్ణయం తీసుకున్నారు.


