Homeతెలంగాణతెలంగాణ బ్రాండ్‌గా టీపీఎస్‌లు.. 73 పాఠశాలలకు గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ బ్రాండ్‌గా టీపీఎస్‌లు.. 73 పాఠశాలలకు గ్రీన్‌సిగ్నల్

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో తీర్చిదిద్ది తెలంగాణ బ్రాండ్‌గా నిలబెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు (టీపీఎస్‌) అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు దీటుగా ఉండేలా అభివృద్ధి చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ క్రమంలో కొత్తగా 73 టీపీఎస్‌ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.

రూ.699.89 కోట్లతో నిర్మాణాలు
కొత్తగా ఏర్పాటు చేయనున్న 73 టీపీఎస్‌ల కోసం ప్రభుత్వం రూ.699.89 కోట్లను కేటాయించింది.ఇందులో రాష్ట్ర బడ్జెట్‌ నుంచి రూ.209.96 కోట్లు ఖర్చు చేయనున్నారు.మిగిలిన రూ.489.93 కోట్లను ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) నుంచి రుణంగా సమీకరించనున్నారు.ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేశారు. సోమవారం ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. తదుపరి ప్రక్రియ చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఈడబ్ల్యూఐడీసీ) ఎండీలను ఆదేశించింది. టీపీఎస్‌ల నిర్మాణ పనులకు ఈ నెలలోనే టెండర్లు పిలుస్తామని టీజీఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతిరెడ్డి తెలిపారు. దీంతో కొత్త పాఠశాలల నిర్మాణ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.

100 టీపీఎస్‌ల లక్ష్యంలో 78కి అనుమతులు
రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గత ఫిబ్రవరిలో నిర్ణయించారు.ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం, అచ్చంపేట నియోజకవర్గాల్లో రెండేసి చొప్పున, గజ్వేల్‌లో ఒక టీపీఎస్‌ను ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది.ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆరుట్ల టీపీఎస్‌ మూడు నెలల క్రితమే ప్రారంభమైంది.మిగిలిన పాఠశాలల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు నెల రోజుల క్రితం 95 కొత్త టీపీఎస్‌ల నిర్మాణానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు.వాటిలో 73 పాఠశాలలకు తాజాగా పరిపాలనాపరమైన అనుమతులు లభించాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం 78 టీపీఎస్‌ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లయింది.

సెమీ రెసిడెన్షియల్‌ విధానంలో..
యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలతో పోలిస్తే తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్ల విధానం భిన్నంగా ఉంటుంది.టీపీఎస్‌లను సెమీ రెసిడెన్షియల్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు.ఇప్పటికే ఉన్న కొన్ని ప్రభుత్వ పాఠశాలలను కూడా టీపీఎస్‌లుగా మార్చి, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను సమకూర్చనున్నారు.ఆరుట్ల టీపీఎస్‌ తరహాలో క్రీడా మైదానం, బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ తదితర క్రీడలకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు.గ్రంథాలయాలు, కంప్యూటర్‌-సైన్స్‌ ల్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రీప్రైమరీ విద్యార్థుల కోసం ప్రత్యేక ఆటస్థలాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.

ప్రీప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు..
ప్రీప్రైమరీ నుంచి పదో తరగతి లేదా ఇంటర్‌ వరకు నాణ్యమైన విద్యను ఒకే చోట అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.ఇందుకోసం కనీసం రెండు నుంచి మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను టీపీఎస్‌లుగా అభివృద్ధి చేయనున్నారు.ఆ పరిసర ప్రాంతాల్లోని మరో రెండు మూడు ప్రభుత్వ పాఠశాలలను టీపీఎస్‌లో విలీనం చేస్తారు.అవకాశం ఉన్నచోట సమీపంలోని జూనియర్‌ కళాశాలను కూడా ఇక్కడికి తరలించే యోచన ఉంది.దీనివల్ల విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు అవసరమైన స్థాయిలో ఉపాధ్యాయులు అందుబాటులోకి వస్తారని ప్రభుత్వం భావిస్తోంది.

1,000 నుంచి 1,500 మంది విద్యార్థులు
టీపీఎస్‌లలో విద్యార్థుల సంఖ్య కనీసం 1,000 నుంచి 1,500 వరకు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవడం వల్ల మెరుగైన విద్యా వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.ప్రస్తుతం సాధారణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు.టీపీఎస్‌లలో మాత్రం సాయంత్రం కూడా అల్పాహారం అందించేలా సౌకర్యాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు