Homeజాతీయంయువ నాయకత్వానికి పెద్దపీట.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ చేస్తున్న రాహుల్

యువ నాయకత్వానికి పెద్దపీట.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ చేస్తున్న రాహుల్

- Advertisement -

కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత మార్పులకు వేగం పెరుగుతోంది. కొత్త, ఉత్సాహభరితమైన యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు.ఇందులో భాగంగా పార్టీ జాతీయ కార్యదర్శుల నియామకానికి ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రక్రియను చేపట్టారు.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 120 మంది నాయకులతో రాహుల్‌ గాంధీ స్వయంగా మాట్లాడి.. వారి క్షేత్రస్థాయి పని, పనితీరు, నాయకత్వ సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు.

యువతకు ప్రాధాన్యం.. సంస్థాగత ప్రక్షాళనపై దృష్టి
కాంగ్రెస్‌ సంస్థను మరింత చురుకుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాహుల్‌ గాంధీ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.పాతతరం నాయకులు, డ్రాయింగ్‌ రూమ్‌ రాజకీయాలకే పరిమితమైన విధానానికి బదులుగా.. ప్రజల్లో చురుకుగా పనిచేసే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు సమాచారం.ఈ క్రమంలో రాజకీయ సీనియారిటీ కంటే నాయకుల పనితీరు, ప్రజల్లో వారి చురుకుదనం, క్షేత్రస్థాయిలో ఉన్న అనుభవానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

120 మంది నాయకులకు ఇంటర్వ్యూలు
జాతీయ కార్యదర్శుల పదవుల కోసం ఎంపిక చేసిన 120 మంది నాయకులను రాహుల్‌ గాంధీ ఇంటర్వ్యూ చేస్తున్నారు.ఒక్కో బృందంలో 10 మంది చొప్పున ఈ ప్రక్రియ కొనసాగుతోంది.రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.సోమవారం రాహుల్‌, ప్రియాంక కలిసి 30 మంది నాయకులను ఇంటర్వ్యూ చేసినట్లు సమాచారం.తన రెండు రోజుల రాయ్‌బరేలీ పర్యటనను ముగించుకుని రాహుల్‌ గాంధీ ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత మిగిలిన నాయకుల ఇంటర్వ్యూలు కొనసాగనున్నాయి.

నాయకుల గత పనితీరుపై ప్రత్యేక ఆరా
ఇంటర్వ్యూ సందర్భంగా నాయకుల గత రాజకీయ కార్యకలాపాలు, పార్టీ కోసం చేసిన సేవలు, వ్యక్తిగత ప్రొఫైల్‌, క్షేత్రస్థాయి అనుభవం వంటి అంశాలపై రాహుల్‌ గాంధీ ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది.ఇంటర్వ్యూకు హాజరవుతున్న ప్రతి నాయకుడి పూర్తి ప్రొఫైల్‌, పనితీరుకు సంబంధించిన నివేదికలు ఇప్పటికే ఆయన వద్ద ఉన్నట్లు సమాచారం.కేవలం పార్టీ నేతల సిఫార్సులు లేదా సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోకుండా.. వాస్తవంగా ప్రజల్లో ఎవరు పనిచేస్తున్నారు? వారి సామర్థ్యం ఎంత? పార్టీ భవిష్యత్తుపై వారి ఆలోచన ఏమిటి? వంటి అంశాల ఆధారంగానే ఎంపిక చేయాలని రాహుల్‌ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

60 శాతానికి పైగా జాతీయ కార్యదర్శుల మార్పు?
కాంగ్రెస్‌ ప్రస్తుత జాతీయ కార్యదర్శుల్లో 60 శాతానికి పైగా మార్పులు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.కొత్తవారికి అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీ సంస్థలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలన్నది కాంగ్రెస్‌ ఆలోచనగా కనిపిస్తోంది.గతంలో పార్టీ చేపట్టిన ఃసంస్థాగత ఏర్పాటుః కార్యక్రమంలో పరిశీలకులుగా పనిచేసిన నాయకులకు కూడా జాతీయ కార్యదర్శుల ఎంపికలో ప్రాధాన్యం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రం నుంచి జిల్లా వరకు యువతకు అవకాశాలు
కాంగ్రెస్‌లో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ ఇప్పటికే రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కొనసాగుతోంది.పార్టీ కోసం క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేస్తున్న యువ నాయకులు, కార్యకర్తలకు కీలక బాధ్యతలు అప్పగించే ప్రయత్నం జరుగుతోంది.దేశంలోని వివిధ ప్రాంతాలకు, సమాజంలోని అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా కొత్త బృందాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.తద్వారా పార్టీ సంస్థాగత వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

రెండు దశాబ్దాలుగా రాహుల్‌ అదే లక్ష్యం
రాహుల్‌ గాంధీ 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచే కాంగ్రెస్‌లో తరాల మార్పు, యువతకు ప్రాధాన్యం ఇవ్వడం ఆయన ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది.యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐలోనూ గతంలో ఇంటర్వ్యూల ఆధారంగా నాయకుల ఎంపిక విధానాన్ని ఆయన ప్రోత్సహించారు.రాజకీయ కుటుంబ నేపథ్యం లేదా సిఫార్సులు లేని యువతలో ప్రతిభ ఉన్నవారిని గుర్తించి.. వారికి నాయకత్వ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఆ విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.అయితే అప్పట్లో పాతతరం నాయకుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఈ ప్రయోగాలకు అడ్డంకిగా మారాయి.దీంతో తొలి దశలో ఆశించిన స్థాయిలో ఈ మార్పులు ముందుకు సాగలేకపోయాయి.

ఇప్పుడు మారుతున్న కాంగ్రెస్‌ ముఖచిత్రం
ప్రస్తుతం కాంగ్రెస్‌లో జరుగుతున్న సంస్థాగత మార్పులతో పరిస్థితి క్రమంగా మారుతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.సీనియర్‌ నేతల స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తూ పార్టీ పునర్వ్యవస్థీకరణకు రాహుల్‌ గాంధీ శ్రీకారం చుడుతున్నట్లు కనిపిస్తోంది.జాతీయ కార్యదర్శుల ఎంపిక కోసం రూపొందిస్తున్న కొత్త విధానంలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు, యువ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.కొత్త ఆలోచనలు, ఉత్సాహం, ప్రజల కోసం పనిచేయాలన్న నిబద్ధత ఉన్న నాయకులతో కాంగ్రెస్‌ భవిష్యత్‌ టీమ్‌ను ఏర్పాటు చేయడమే రాహుల్‌ గాంధీ లక్ష్యంగా కనిపిస్తోంది.మరి ఈ కొత్త నాయకత్వం కాంగ్రెస్‌ సంస్థాగత వ్యవస్థను ఎంతవరకు మార్చగలదు? పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంలో ఎంతవరకు విజయవంతమవుతుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు