న్యూదిల్లీ: శబరిమల ఆలయం సహా వివిధ మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష, మతస్వేచ్ఛపై దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. ఈ నెల 29లోపు లిఖితపూర్వక వాదనలకు అంగీకారం తెలిపింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును రెండువారాలకు పైగా విచారణ జరిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు సి.ఎస్. వైద్యనాథన్, అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గీ, ఇందిరా జైసింగ్ల వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. విచారణకు ముందు శబరిమల ఆలయంలోకి రుతుక్రమం వయస్సున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సమర్థించాలని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ అంశం పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించింది కాబట్టి న్యాయసమీక్ష పరిధిలోకి రాదని పేర్కొంది. కాగా, 2018 సెప్టెంబర్లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4:1 మెజారిటీతో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. 2019 నవంబర్లో అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వివాదంతోపాటు ఇతర మతాల్లోని మహిళలపై వివక్ష అంశాలను 9మంది సభ్యులతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేసింది.


