Homeసీఎం సార్…మా డబ్బులు మాకు ఇవ్వండి

సీఎం సార్…మా డబ్బులు మాకు ఇవ్వండి

- Advertisement -
  • నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయిన ఉద్యోగులు
  • ఆందోళన తీవ్రతరం కాకముందే స్పందించాలి
  • ఏపీ జేఏసీ అమరావతి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏపీజేఏసీ అమరావతి జేఏసీ నాయకత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల బకాయిలు, ఇతర న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం తొలి దశ ఉద్యమ కార్యాచరణను ప్రారంభించింది. ఈ ఆందోళనలో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పంచాయతీ సచివాలయాల నుంచి కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్‌డీఓ ఆఫీసులు, మునిసిపాలిటీలు, పాఠశాలలు, పశుసంవర్ధక£ శాఖ, ఆర్‌టీసీ డిపోలు, ఇంజనీరింగ్ విభాగాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఈ నిరసనలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్ల వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లు (డీపీలు), స్టేటస్సులలో ‘సీఎం సార్… మా డబ్బులు మాకు ఇవ్వండి’ అనే నినాదాన్ని ఉంచుకుని తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఈ నెల 1 వ తేదీ నుంచి 5 వరకు ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలతోనే విధుల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు. ఆ తర్వాత 2 నుంచి 8 వ తేదీ వరకు ప్రతి ఉద్యోగిని నేరుగా కలసి ఉద్యమ ఉద్దేశాన్ని వివరించేలా ‘చేయి చేయి కలిపే’ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబరు 3, 5 తేదీల్లో అన్ని జిల్లా, డివిజన్ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో మధ్యాహ్న భోజన సమయంలో ఆందోళనలు చేపడతారు. అనంతరం 11 న విజయవాడతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి, వివిధ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల మద్దతు కూడగట్టనున్నట్లు తెలిపారు. పీఆర్‌సీ, కరువు భత్యం (డీఏ) బకాయిలు, మధ్యంతర భృతి విడుదల, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ క్వాంటమ్ పునరుద్ధరణ, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపు, వారి సంక్షేమ పథకాల అమలు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జులై 22 న నిర్వహించిన చర్చల్లో ఎలాంటి స్పష్టమైన హామీలు ఇవ్వకపోవడంతోనే ఈ ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని వివరించారు. ఈ పోరాటం ఏ ప్రభుత్వానికీ వ్యతిరేకం కాదని, కేవలం ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసమేనని, సంఘాల సరిహద్దులను పక్కనబెట్టి ఉద్యోగులందరూ ఐక్యంగా ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రశాంతంగా సాగుతున్న ఈ ఆందోళన తీవ్రరూపం దాల్చక ముందే ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ జేఏసీ నేతలు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు