దీపావళికి జీఎస్టీలో కొత్త సంస్కరణలు
. దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం
. అణు శక్తి పది రెట్లు పెంచే కసరత్తు
. ఇంధనాల దిగుమతిపై ఆధారం తగ్గించడంపై దృష్టి
. మోదీ ‘పంద్రాగస్టు’ ప్రసంగం
న్యూదిల్లీ: స్వీయసమృద్ధే లక్ష్యంగా భారత్ ముందుకెళుతోందని ప్రధాని మోదీ అన్నారు. జీఎస్టీలో కొత్త సంస్కరణలను దీపావళి కానుకగా అందజేస్తామని ప్రకటించారు. దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం తెస్తున్నామని, అణు శక్తిని పది రెట్లు పెంచుతామని తెలిపారు. ఇంధనాల దిగుమతిపై ఆధారాన్ని తగ్గంచుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడిరచారు. 79వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా దిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను మోదీ వరుసగా 12 వసారి ఎగురవేశారు. 2047 వికసిత భారత్ విజన్‌తో, నయా భారత్ థీమ్‌తో పంద్రాగస్టు వేడుకలు జరిగాయి. మోదీ తొలుత రాజ్‌ఘాట్ వద్ద మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. ఎర్రకోట వద్ద రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు స్వాగతం పలికారు. ఆపై రక్షణ దళాల గౌరవ వందనాన్ని మోదీ స్వీకరించారు. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకగా సిందూర వర్ణపు దుస్తులు, తలపాగా ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత జాతినుద్దేశించి 103 నిమిషాలు ప్రసంగించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమయ్యారు. అనేక సవాళ్లు ఎదుర్కొన్న భారత్ నేడు స్వయంసమృద్ధి దిశగా నడుస్తోందని, తిండిగింజల కోసం ఇబ్బంది పడిన దేశం నేడు ప్రపంచానికి గింజలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని చెప్పుకున్నారు. ఎగుమతి, దిగుమతులు, ఆదాయ వ్యయాలే స్వయంసమృద్ధి కాదని, మేకిన్ ఇండియా సత్తా ఏమిటో ‘ఆపరేషన్ సిందూర్’ చాటిందని మోదీ అన్నారు. 2035 నాటికి దేశానికి సుదర్శన చక్రాన్ని అందిచడం కోసం సుదర్శన్ చక్ర మిషన్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. భారత సరిహద్దు ప్రాంతాల్లో చొరబాటుదారులకు చెక్ పెట్టేందుకు హైపవర్ డెమొగ్రఫీ మిషన్‌ను ప్రారంభిస్తామని మోదీ ప్రకటించారు. ‘భారత్ సమున్నత శక్తిగా ఎదుగుతోంది. సాంతికేతక, సహాయం కోసం ప్రపంచాన్ని అర్థించట్లేదు. సెమీ కండక్టర్లు సహా అనేక రంగాల్లో స్వీయసమృద్ధి సాధిస్తోంది. 50-60 ఏళ్ల క్రితమే వీటి తయారీ ఆలోచన ఉంది కానీ మేడిన్ ఇండియా చిప్‌లు త్వరలోనే మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి’ అని మోదీ అన్నారు. జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీలో కొత్త సంస్కరణలను దీపావళి కానుకగా ఇస్తామని, సామాన్యులపై భారం తగ్గేలా చూస్తామన్నారు. దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు ప్రధాని మోదీ వెల్లడిరచారు. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద దీనిని అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రైవేటు కంపెనీల్లో కొత్త ఉద్యోగులకు ప్రభుత్వం తరపున నెలకు రూ.15వేలు అందించనున్నట్లు వెల్లడిరచారు. భారత అణుశక్తి సామర్థ్యాన్ని పది రెట్లు పెంచేందుకు 10 కొత్త రియాక్టర్లపై పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. దిగుమతులపై ఆధారపడకుండా స్వచ్ఛమైన విద్యుత్తును స్వయంగా ఉత్పత్తి చేయగలగాలని, ఇందుకు అణు రంగంలో ప్రధాన సంస్కరణలు తెస్తున్నామని చెప్పారు. సౌర విద్యుత్ సామర్థ్యం 30 రెట్లు పెరిగిందన్నారు. పర్యావరణాన్ని కలుషితం చేయకుండా పరిశ్రమలు, వాహనాలకు శక్తినిచ్చే క్లీన్ హైడ్రోజన్ ఇంధనం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నావ ుని అన్నారు. దేశ బడ్జెట్లో ఎక్కువ భాగం పెట్రోల్, డీజిల్, గ్యాస్ దిగుమతి కోసం ఖర్చు అవుతుందని, సౌర, హైడ్రోజన్, జల, అణుశక్తిలో ప్రధాన విస్తరణలతో పాటు సముద్ర వనరులు ఉపయోగించుకునేందుకు నేషనల్ డీప్ వాటర్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్‌నూ ప్రారంభించనున్నామని మోదీ చెప్పారు. రైతులు, పశు పెంపకందారులు, మత్స్యకారుల ప్రయోజనాలపై రాజీ పడమని, వారికి నష్టం కగిలిగించే చర్యలను అడ్డుకుంటామని అమెరికా సుంకాల నేపథ్యంలో అన్నారు. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో సత్తా చాటేందుకు సమయం ఆసన్నమైందన్నారు. భారత్ అవసరాలకు అనుగుణంగా సరికొత్త సాంకేతికత ఆవిష్కరణల అవసరమన్నారు. ‘చరిత్రను లిఖించాల్సిన సమయం ఇది. మనం ప్రపంచ మార్కెట్‌ను ఏలాలి. ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో సామర్థ్యం నిరూపించుకోవాలి. తక్కువ ధర, అధిక నాణ్యత లక్ష్యంగా ముందుకెళ్లాలి’ అని పిలుపునిచ్చారు. దేశంలోని వ్యాపారులు, దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టిపెట్టాలన్నారు. ‘ఓకల్ ఫర్ లోకల్’ అనేది నిరంతర నినాదం కావాలన్నారు. ప్రభుత్వ విధానాలలో మార్పులు అవసరమైతే తెలియజేయాలని, రైతులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని మోదీ వెల్లడిరచారు.


