. విధ్వంసం నుంచి వికాసం దిశగా…
. ‘సూపర్ సిక్స్’ అమలు చేసి చూపించాం
. వృథా నీరు సద్వినియోగానికే బనకచర్ల
. రాజకీయ ముసుగులో వైసీపీ నేరాలు
. కేంద్రసాయంతో కీలక ప్రాజెక్టుల సాధన
. స్వాతంత్య్ర వేడుకల్లో చంద్రబాబు ఉద్ఘాటన
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా విధ్వంసం సృష్టిస్తే.. ఏడాదిలోనే వికాసం దిశగా ఏపీని నడిపిస్తున్నామన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్ర్రంలో అమలుకాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందజేస్తున్నామన్నారు. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్‌సిక్స్‌ను సూపర్‌హిట్ చేశామన్నారు. ప్రతివర్గానికీ, ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సాయంగా నిలబడుతూ సంక్షేమ పాలనకే కొత్త నిర్వచనం ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజునే ఐదు సంతకాలతో ప్రధాన హామీల అమలుకు శ్రీకారం చుట్టామని, సామాజిక భద్రత పంఛన్లు మొదలుకొని శుక్రవారం ప్రారంభించిన స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వరకు ప్రతి అంశాన్ని ఆసాంతం వివరించారు. పింఛన్లు, తల్లికి వందనం, దీపం-2.0, అన్నదాత సుఖీభవ వంటి పథకాల గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో పాటు ఏపీ బ్రాండ్ గురించి, పెట్టుబడుల సాధనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, వివిధ వర్గాలకు అందించిన సేవలను... ఆయా రంగాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ముఖ్యంగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ, పేదల కోసం 204 అన్నా క్యాంటీన్లు, పీ4తో పేదరిక నిర్మూలనకు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
వైసీపీ తీరుపై చురకలు
శాంతి భద్రతలపై ప్రభుత్వ విధానాన్ని ప్రస్తావించిన సందర్భంగా పరోక్షంగా వైసీపీకి చంద్రబాబు చురకలంటించారు. కొందరు రాజకీయ ముసుగులో నేరాలు చేస్తూ… ప్రొత్సహిస్తున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను వివిధ సందర్భాల్లో చంద్రబాబు ప్రస్తావించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు ప్రతి శాఖలో వెలుగు చూస్తున్నాయంటూ గత పాలకుల తీరును తప్పుపట్టారు. గత ప్రభుత్వం నిలిపేసిన పథకాలను తాము పునరుద్ధరించామనే విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఆడిన డ్రామాలను గుర్తు చేశారు. గుంతలతో వదిలేసిన రోడ్ల తీరును ముఖ్యమంత్రి వివరించారు. కొత్త జిల్లాలను గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిందని… ఇప్పుడు వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చెప్పారు. మద్యం, ఇసుక వంటి వాటిల్లో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తావించిన చంద్రబాబు… ఎస్సీలకు మైక్రో, డ్రిప్ సబ్సిడీలను నిలిపేసిందని గుర్తు చేయడంతోపాటు గతంలో జరిగిన రెవెన్యూ అక్రమాలను సరి చేసి… పేదల భూములకు రక్షణ కల్పించామన్నారు.
బనకచర్లకు కట్టుబడే ఉన్నాం
ఇరిగేషన్ రంగంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ… పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు గురించి చంద్రబాబు కీలక ప్రస్తావన చేశారు. వృథాగా సముద్రంలో కలుస్తున్న వరద జలాలను వినియోగించుకుంటే… ఎగువ రాష్ట్రాలకు ఇబ్బంది ఉండదని చెప్పడం ద్వారా బనకచర్ల విషయంలో ప్రభుత్వ విధానాన్ని మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు. వరద వచ్చినప్పుడు కిందకు వదిలేస్తున్న వాళ్లు… అదే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం చెప్పడం సమంజసమా అని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం, బీఆర్‌ఎస్ పార్టీ బనకచర్ల విషయంలో చేస్తున్న వాదనల నేపథ్యంలో ఏపీ వాదనను, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని స్వాతంత్య్ర దినోత్సవ వేదికగా మరోసారి స్పష్టం చేయడం ఆసక్తికర పరిణామంగా నిలిచింది. హంద్రీ-నీవా కాల్వల వెడల్పు పనులను రికార్డు స్థాయిలో పని చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూనే… ఈ ఏడాది ఉత్తరాంధ్ర, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
కేంద్రం అండతో ప్రాజెక్టుల సాధన
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చంద్రబాబు వెల్లడిరచారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సెమీ కండక్టర్ల యూనిట్ గురించి, పోలవరం, అమరావతి రాజధానికి సహాయం, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నిధుల కేటాయింపు వంటి అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. దీంతోపాటు ఇటీవల భారతదేశంపై అమెరికా విధించిన సుంకాల నేపథ్యంలో మన దేశ ఎకానమీ గురించి చంద్రబాబు మాట్లాడారు. మనది డెడ్ ఎకానమీ కాదు… గుడ్ ఎకానమీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తద్వారా రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు ప్రధానికి అండగా ఉంటామని చంద్రబాబు సంకేతమిచ్చారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన త్రివిధ దళాలకు సీఎం స్వాతంత్య్ర దినోత్సవ వేదిక నుంచి సెల్యూట్ చేశారు. వివిధ శాఖల ప్రగతిని వివరిస్తూ ప్రదర్శించిన శకటాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.


