న్యూదిల్లీ: ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన రెండవ దశ పూర్తి అయింది. తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఎస్‌ఐఆర్ 2.0లో మొత్తం 13 శాతం అంటే 6.56 కోట్ల ఓటర్ల పేర్లను జాబితాల నుంచి ఈసీ తొలగించింది. ఒక్కొక్కటిగా రాష్ట్రాల్లో ప్రక్రియను పూర్తి చేసుకుంటూ ముసాయిదా ఓటర్ల జాబితాలు వెలువరించింది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఓటర్లను తొలగించింది. ఎస్‌ఐఆర్ రెండవ దశకు ముందు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 50.96 కోట్ల మంది ఓటర్లు ఉండగా… తాజా ప్రక్షాళన తర్వాత ఆ సంఖ్య 44.4 కోట్లకు పడిపోయింది. ముసాయిదా జాబితాల నుంచి తొలగించిన వారి పేర్లను ‘ఏఎస్‌డీ’ (గైర్హాజరు, తరలిపోవడం, మరణించడం/డూప్లికేట్) కింద పేర్కొన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడిరచారు. తరలిపోయిన కారణంగా 4.64 కోట్ల మందిని, మరణించిన 1.46 కోట్ల మంది పేర్లను, అనేక చోట్ల నమోదైన కారణంగా మరో 44.06 లక్షల మంది పేర్లను జాబితాల నుంచి తొలగించినట్లు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, చత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ 2.0 నిర్వహించిన విషయం విదితమే. ఉత్తరప్రదేశ్ ఓటర్ల ముసాయిదా జాబితా నుంచి 18.7 శాతం అంటే 2.89 కోట్ల మంది పేర్లు తొలగించారు. అంతకుముందు 15.44 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య 12.55 కోట్లుగా తగ్గింది. మరణించిన 46.23 లక్షల మంది పేర్లను జాబితాల్లో నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే, శాశ్వతంగా తరలిపోయిన వారు 2.17 కోట్ల మంది ఉండగా, ఎక్కువ చోట్ల నమోదైన వారు 25.47 లక్షల మేరకు ఉన్నట్లు వెల్లడిరచింది. పశ్చిమ బెంగాల్‌లో 7.59 శాతం అంటే 58,20,898 ఓట్లు తొలగించారు. దీంతో ఓటర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 7.08 కోట్లకు పడిపోయింది. తమిళనాడులో 15.19 శాతం అంటే 97.37 లక్షల పేర్లను ముసాయిదా జాబితాల్లో నుంచి ఈసీ తొలగించింది. ఇందులో 66.5 లక్షల మంది చిరునామా మారిందని, 26.9 లక్షల మంది చనిపోయారని, 3.98 లక్షల మంది ఎక్కువ చోట్ల నమోదై ఉన్నారని తమిళనాడు సీఈఓ విడుదల చేసిన డేటా తెలిపింది. గతంలో 6,41,14,587గా ఉన్న రాష్ట్ర ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 5,43,76,755కు పడిపోయింది. కేరళలో 2.78 కోట్ల ఓటర్లు ఉండగా అందులో 8.65 శాతం అంటే 24,08,503 మంది పేర్లు తొలగించి ముసాయిదా జాబితాను ఈసీ విడుదల చేసింది. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 2,78,50,855 నుంచి 2,54,42,352కు తగ్గింది. తొలగించిన వారిలో 1,60,830 మంది ఎన్యుమరేషన్ ఫారాలు పూర్తి చేయలేదు లేదా వాటిని అంగీకరించలేదు. మరో 6,45,548 మంది జాడలేరు. మిగిలిన 6,49,885 మంది చనిపోయారు. 8,16,221 మంది తరలిపోయారు. 1,36,029 నకిలీలని ఈసీ పేర్కొంది. గుజరాత్‌లో వివిధ కారణాలతో 73.73 లక్షల మంది (14.5శాతం) పేర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. గతంలో నమోదైన ఓటర్ల సంఖ్య 5.08 కోట్లుగా ఉంటే ప్రస్తుతం 4.34 కోట్లకు చేరింది. మధ్యప్రదేశ్‌లో 42.74 లక్షలు (7.45శాతం) మంది ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితాల్లో నుంచి తొలగించారు. అందులో 8.46 లక్షల మంది చనిపోగా, 31.51 లక్షల మంది ఎన్యుమరేషన్ సమయంలో అందుబాటులో లేరు లేదా వలస వెళ్లిపోయారు. మిగిలిన 2.77 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో నమోదై ఉన్నారు. దీంతో 5.7 కోట్లుగా ఓటర్ల సంఖ్య 5.3 కోట్లకు చేరింది. రాజస్థాన్‌లో 41.84 లక్షల మంది (7.65శాతం) ఓటర్ల పేర్లను తొలగించారు. ఎస్‌ఐఆర్‌కు ముందు రాష్ట్రంలో 5.46 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. చత్తీస్‌గఢ్‌లో 27 లక్షల మందికిపైగా అంటే 12.88 శాతం మేర ఓట్లను తొలగించారు. ఎస్‌ఐఆర్‌కు ముందు చత్తీస్‌గఢ్‌లో 2,12,30,737 మంది ఓటర్లు ఉన్నారు. గోవా ఓటర్ల ముసాయిదా జాబితా నుంచి లక్ష మంది పేర్లు తొలగించారు. దీంతో ముసాయిదా జాబితాలో 10.84 లక్షల మంది పేర్లు ఉన్నాయి. అంతకుముందు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 11.85 లక్షలుగా ఉన్నది. అండమాన్, నికోబార్ దీవుల్లో 3.1 లక్షల నుంచి 64వేలు అంటే 20.62 శాతం ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. పుదుచ్చేరిలో 1.03 లక్షలు అంటే 10.12 శాతం పేర్లను తొలగించారు. తొలగించిన పేర్లలో 20,798 మంది చనిపోగా, 80,645 మంది అందుబాటులో లేరు. మరో 2,024 మంది ఎక్కువ స్థానాల్లో నమోదై ఉన్నారు. దీంతో ఓటర్ల సంఖ్య 10.21 లక్షల నుంచి 9.18 లక్షలకు తగ్గింది. లక్షద్వీప్ ఓటర్లు మొత్తం 57,813 కాగా ముసాయిదా జాబితాలో 56,384 పేర్లు ఉన్నాయి. తొలగించిన 1,429 (2.47శాతం) మందిలో 705 మంది చనిపోయిన వారు ఉండగా, 252 తరలిపోయారు లేదా అందుబాటులో లేరు. మరో 472 మంది వేర్వేరు చోట్ల నమోదై ఉన్నారు.
6.5 కోట్ల ఓట్లు తొలగింపు
- Advertisement -
RELATED ARTICLES


