Homeవిశ్లేషణ90 ప్రశ్నపత్రాలు లీక్… ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు

90 ప్రశ్నపత్రాలు లీక్… ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు

- Advertisement -

డా॥అరుణ్ మిత్ర

ఇటీవల లక్నోలోని ఒక కోచింగ్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కొంతమంది విద్యార్థులు గాయపడ్డారు. అంతకుముందు దేశంలో ప్రధాన కోచింగ్ కేంద్రంగా మారిన కోటా ప్రాంతంలో విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు ప్రతి ఏడాది వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇవి అత్యంత విషాదకరమైన, హృదయ విదారక సంఘటనలు. వీటి గురించి పౌర సమాజం, ప్రభుత్వాలు గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా, వివిధ పోటీ పరీక్షలకు కష్టపడి కోచింగ్ తీసుకుని పరీక్షలకు వెళ్లడానికి ముందే ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్న ఘటనలను కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ లీకులు కూడా డబ్బు, పలుకుబడి, అవినీతి కారణంగా జరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన ప్రతిసారీ విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాయాల్సి వస్తోంది. దీనివల్ల వారిపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పడుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గత పదేళ్లలో దాదాపు 90 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలనే ఆశతో రాత్రింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాస్తారు. వీళ్ల కోసం కుటుంబం అంతా తోడుగా ఉంటుంది. ఎంతో మంది విద్యార్థులు ఒకే పరీక్షను మూడు నాలుగు సార్లు కూడా రాస్తుంటారు. ఇలాంటి సమయంలో ప్రశ్నాపత్రాలు లీకైన సందర్భాల్లో విద్యార్థుల్లో కోపం, నిరాశ, నిస్సహాయత పెరుగుతాయి. ఒక పరీక్షలో బాగా రాసిన విద్యార్థి, మళ్లీ నిర్వహించే పరీక్షలో కూడా అదే స్థాయిలో రాణిస్తాడనే నమ్మకం ఉండదు. ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇది వారి కుటుంబాలతో పాటు మొత్తం సమాజానికే తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. విచారకరమైన విషయం ఏమిటంటే, పదో తరగతి తర్వాత అనేక పాఠశాలల్లో విద్య పేరుకే తప్ప ఎందుకు ఉపయోగం ఉండడం లేదు. విద్యార్థులను కోచింగ్ సెంటర్లకు పంపించి కేవలం ప్రవేశ పరీక్షలకు మాత్రమే శిక్షణ ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పాఠశాలలే విద్యార్థులను కోచింగ్ సంస్థల్లో చేరమని ప్రోత్సహిస్తూ పక్కకు తప్పకుంటున్నాయి. కొన్నిచోట్ల విద్యార్థులు పాఠశాలకు హాజరుకాకపోయినా హాజరు వేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. పాఠశాల విద్య ఉపాధ్యాయులతో ముడిపడి ఉsటుంది.
అర్థం కానివి అడిగి తెలుసుకోవడం, చర్చలు చేయడం వంటి వాటి వలన వాళ్ల ఆలోచనా పరిధి విస్తరిస్తూ ఉంటుంది. ఇవి విద్యార్థుల భవిష్యత్తు వికాసానికి ఎంతో ఉపయోగపడతాయి. కానీ కోచింగ్ సెంటర్లు ప్రవేశ పరీక్షలకు వచ్చే ప్రశ్నలను మాత్రమే పరిష్కరించేలా వాటికి బట్టిపట్టి బాగా గుర్తుపెట్టుకునేలా చేయడానికే చూస్తూ ఉంటాయి. ఏదైనా చేసి ఒక సీటు సంపాదించాలన్న భావనే విద్యార్థుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వీటన్నిటి వలన విద్య అసలు ఉద్దేశ్యం పక్కకు పోయింది. అంటే మంచి పౌరులను, జ్ఞానవంతులను, విశాల దృక్పథం కలిగిన వ్యక్తులను, సామాజిక సమస్యల పట్ల సున్నితంగా స్పందించే మేధావులను తయారుచేయడం అనే ఆలోచనే మరుగున పడిపోతోంది. కోచింగ్ సెంటర్లలో చదవడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కుటుంబాలు ఈ ఖర్చులను భరించలేవు. ఫలితంగా వారి పిల్లలు పోటీలో వెనుకబడిపోతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పరీక్షా విధానం విద్యార్థుల అసలు ప్రతిభను సరైన రీతిలో అంచనా వేయలేకపోతోంది. అందుకే కోచింగ్ సంస్థలే ముందస్తున్న బాగా చదివి ఎక్కువ మార్కులను సాధిస్తాడన్న విద్యార్థులనే ఎంపిక చేసుకున్నా వారి మీదనే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయన్న వార్తలను తరచూ వింటూ ఉంటాం. ఇటువంటి విధానాలు చిన్న వయసు నుంచే వివక్షను పెంచుతున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. విద్యార్థులను ఎలా అంచనా వేయాలి అన్నదే ఇక్కడ ప్రధానం. ప్రస్తుత విధానంలో విద్యార్థి నిజమైన సామర్థ్యాన్ని న్యాయంగా కొలవడం సాధ్యం కాని పని. గతంలో వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశాలు ప్రధానంగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి మార్కుల ఆధారంగా జరిగేవి. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. మార్కుల కేటాయింపుపై కూడా సిఫార్సులు, ఒత్తిళ్లు ప్రభావం చూపిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యావేత్తలతో సంప్రదించి, విద్యార్థుల అంచనా విధానంపై విస్తృత చర్చ జరపాల్సిన అవసరం ఉంది. నీట్ ప్రశ్నాపత్రాల లీక్ అంశానికి వస్తే, పరీక్షను నిర్వహించే బాధ్యతలు చేపట్టిన సంస్థలే పూర్తి భద్రత, గోప్యత వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ అంశంపై కూడా సమగ్ర పరిశీలన, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. జూన్ 21న పరీక్షా కేంద్రాల వద్ద భారీ స్థాయిలో పారామిలిటరీ బలగాలు, పోలీసు సిబ్బందిని మోహరించడం విద్యార్థులపై అనవసర ఒత్తిడిని పెంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థినుల జడలను, ముడులను కూడా విప్పించి తనిఖీలు చేశారు. గతంలో ప్రశ్నాపత్రాల లీకులు ఇలాంటి మార్గాల ద్వారా జరిగాయన్నట్లుగా వ్యవహరించడం యువ విద్యార్థినుల గౌరవాన్ని దెబ్బతీసే చర్య. అంతేకాదు ఆఖరి నిమిషంలో విద్యార్థుల పరీక్షా కేంద్రాలను మార్చేయడంతో వాళ్లు పరీక్షలకు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. కొందరికి అబుద్ఙా వంటి దూరప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించడంతో వెళ్లలేకపోయామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదంతా విద్యార్థుల పట్ల పరీక్షల నిర్వహణ పట్ల ఎంతటి నిర్లక్ష్య భావన ఉందో సూచిస్తున్నాయి. సాయుధ దళాల ప్రధాన బాధ్యత దేశ సరిహద్దులను రక్షించడం, పరీక్షా ప్రశ్నాపత్రాలను పంపిణీ చేయడం కాదు. కానీ ప్రశ్నాపత్రాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు భారత సైన్యం, భారత వైమానిక దళం సహాయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇది విచారకరమైన విషయం. ఇది ప్రభుత్వ వ్యవస్థల బలహీనతను ప్రతిబింబిస్తుంది. కొత్త విద్యా విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి అది ప్రధానంగా సంపన్న వర్గాల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చేలా సమాజంలో అసమానతలను మరింత పెంచేలా ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యువత, విద్యార్థులు “కాక్రోచ్ జనతా పార్టీ” అనే నినాదంతో తమ నిరసనలను బలంగా వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐతో పాటు ఇంకొన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై దేశ ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పధానమంత్రి మాత్రం జూన్ 21న యోగా కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఫోటోలకు పోజులిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా యోగాను ప్రచారం చేయడంలోనే నిమగ్నమయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థుల బాధల పట్ల ఆయన పూర్తి మౌనం వ్యవహరించారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు