సిపిఐ ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ;వేరుశనగ పంట సాగులో భాగంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా నేటికీ విత్తనం కాయలను పంపిణీ చేయరా అని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లాశ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముదిగుబ్బ లో విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఈ ప్రాంతం పెద్ద మండలంగా పేరుగాంచి 70 శాతం మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారని, తద్వారా ప్రస్తుతం సుమారు 50 శాతం మంది రైతన్నలు వేరుశనగ పంట జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు పంట సాగుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఎన్డీఏ ప్రభుత్వం నేటికీ విత్తనవేరుశనగకాయల పంపిణీ చేయకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సిపిఐ నాయకులు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్ కు సుమారు 1,10,000 క్వింటాళ్లు వేరుశనగ విత్తనం కాయలు అవసరం కాగా ఇప్పటివరకు కనీసం పదివేల క్వింటాళ్ల కాయలను కూడా ప్రాసెస్ చేయలేదని వారు మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఈసారి విత్తనం కాయలను పంపిణీ చేయడానికి ఇంకా కనీసం మూడు నుంచి నాలుగు వారాలు సమయం పట్టే అవకాశం ఉందని దీంతో విత్తనం వేసే సమయం దాటిపోతుందని మండల రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ సమయానికే గత ప్రభుత్వాలు విత్తనం కాయల పంపిణీ ప్రారంభించడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం తాము గత ప్రభుత్వంలో బకాయిపడిన బిల్లులను చెల్లించాల్సి రావడంతో ఈసారి విత్తన వేరుశనక్కాయల సేకరణ ఆలస్య మౌతోందనే కారణాలు చెబుతుండడం సరికాదు అన్నారు. కాగా ఈసారి ముందస్తు వర్షాలు కూడా కురుస్తుండడంతో రైతన్నలు అన్ని విధాల ఇప్పటికే వేరుశనగ పంట సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పటికీ సంబంధిత అధికారులు ఈ సబ్సిడీ విత్తనం కాయలు పంపిణీ చేయకపోవడం చాలా దారుణం అని తెలిపారు. కావున ప్రభుత్వం తక్షణమే విత్తన వేరుశనగలను పంపిణీ చేయడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 70 శాతం సబ్సిడీతో పంపిణీ చేయాలన్నారు. లేని పక్షంలో త్వరలోనే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రైతన్నలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా వేరుశనగ విత్తన కాయలను పంపిణీ చేయరా?
- Advertisement -
RELATED ARTICLES


