ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున డిమాండ్
విశాలాంధ్ర- అనంతపురం : రైతులకు 90% సబ్సిడీతో నాణ్యత కలిగిన అన్ని రకాల విత్తనాలు అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం అనంతపురం రూరల్ తహసిల్దార్ కార్యాలయం వద్ద రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం రూ. 20 వేలు అందించాలని, 90% సబ్సిడీతో నాణ్యత కలిగిన అన్ని రకాల పంటల విత్తనాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రూరల్ మండల కార్యదర్శి మన్నీల వెంకట రాముడు అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ… అనంతపురం జిల్లాలోని రైతులకు మరియు భూమిలేని కౌలు రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం 20 వేల రూపాయలు అందించాలి అలాగే 90% సబ్సిడీతో నాణ్యత కలిగిన అన్ని రకాల పంటల విత్తనాలు అందించాలన్నారు. ప్రతి ఏడాది పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకొని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి రూ. 5 లక్షల వరకు పంట రుణాలు అందించాలని,గ్రామ సభలు నిర్వహించి భూ యజమాని ప్రమేయం లేకుండానే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి హామీ లేకుండా కౌలు రైతులకు రెండు లక్షల వరకు పంట రుణాలు ఇవ్వాలన్నారు. కౌలు రైతుల రక్షణ సంక్షేమం కోసం సమగ్రమైన నూతన కౌలు చట్టాన్ని తీసుకుని రావాలని, దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న ప్రాజెక్టులు,రిజర్వాయర్లు, ప్రధాన కాలువలు, పంట కాలువల మరమ్మతులకు ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి పనులు చేపట్టాలన్నారు. వరి తదితర పంటలకు పక్క రాష్ట్రాల వలె మన రాష్ట్ర ప్రభుత్వం కూడా క్వింటాకు రూ. 500 రూ బోనస్ చెల్లించాలన్నారు. పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పునః సమీక్షించాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమం లో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వన్నారెడ్డి, జిల్లా నాయకులు శ్రీకాంత్, రమేష్, గోవింద నాయక్, రాప్తాడు నియోజకవర్గ నాయకులు రాకెట్ల రాము, నగేష్ అనంతపూర్ రూరల్ మండలం నాయకులు అక్కులప్ప, నరసింహులు, కుల్లాయప్ప మహేష్, ఇమామ్,సల్మాన్, రామాంజినేయులు, ముత్యాలు, విజయ్ కుమార్, ఓబులేసు, మన్నీల సూరి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు 90% సబ్సిడీతో నాణ్యత కలిగిన అన్ని రకాల విత్తనాలు అందించాలి…
- Advertisement -


