Homeఓట్ల చోరీకే ఎస్‌ఐఆర్‌

ఓట్ల చోరీకే ఎస్‌ఐఆర్‌

- Advertisement -

. నిలిపివేతకు విపక్షాల డిమాండ్‌
. పార్లమెంటు వద్ద 11వ రోజు ఆందోళన
. ఉధృత పోరుకు ‘ఇండియా’ నిర్ణయం
. వచ్చేవారం ఈసీ ఘెరావ్‌కు యోచన

న్యూదిల్లీ: ఓటరు జాబితాల సవరణ ’ఎస్‌ఐఆర్‌’ను తక్షణమే నిలిపివేయాలన్న డిమాండ్‌తో తమ పోరాటాన్ని మరింతగా ఉధృతంగా చేపట్టాలని ప్రతిపక్ష ఇండియా ఐక్య సంఘటన నాయకులు నిర్ణయించారు. ఎస్‌ఐఆర్‌ అంటే ప్రజలకు అర్థం కాకపోవచ్చని, ఓట్ల చోరీ ప్రక్రియగా దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల 11వ రోజు (గురువారం) ఆందోళన కొనసాగించారు. నిరసనలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, వయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ‘ఎస్‌ఐఆర్‌`ప్రజాస్వామ్యంపై దాడి’ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఇద్దరు వ్యక్తుల చిత్రాలతో ఒకరి యూనిఫారంపై ‘ఈసీ’ అని రాసి… సంకెళ్లు వేసిన చేతుల్లో ఈవీఎంను పట్టుకొన్నట్లుగా చిత్రీకరించి… ‘ఎస్‌ సర్‌’ అని పక్కనే రాసివున్న కార్టూన్‌తో కూడిన ప్లకార్డులతో ఎంపీలు నిరసన తెలిపారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఈసీ పని చేస్తున్నదని, బీహార్‌ పరిణామాలు ఇందుకు అద్దం పట్టాయని విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ను ఓట్ల చోరీ ప్రక్రియగా అన్ని భాషల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు.
5న కర్నాటకలో రాహుల్‌ ఆందోళన
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ అధ్వర్యంలో కర్నాటకలో మంగళవారం ఆందోళన నిర్వహించనున్నారు. వచ్చే వారంలో ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట ధర్నా, ముట్టడికి ఉన్న అవకాశాలను ‘ఇండియా’ పరిశీలిస్తోందని, బీహార్‌లోనూ ‘ఓట్ల చోరీ’ పేరిట భారీ ఆందోళనకు కసరత్తు చేస్తోందని అధికార వర్గాలు వెల్లడిరచాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ఇచ్చే విందు సందర్భంగా ఎస్‌ఐఆర్‌పై ఇండియా ఐక్య సంఘటన నాయకులకు రాహుల్‌ గాంధీ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిపాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా వేరుగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సర్కారు మాట తప్పినందునే…
కేంద్రప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినందునే ఎస్‌ఐఆర్‌పై తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేయనున్నట్లు ప్రతిపక్షాలు నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడిరచాయి. పార్లమెంటులో ఎస్‌ఐఆర్‌పై చర్చకు అనుమతి ఇవ్వని కారణంగా ఆందోళనలను ఉధృతం చేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదని తెలిపాయి. ఎన్నికల అధికారులు అనేక రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ కోసం ఏర్పాట్లు ప్రారంభించిన నేపథ్యంలో పోరు తీవ్రతరం చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయని పేర్కొన్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌పై బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎస్‌ఐఆర్‌ విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి… ప్రభుత్వం మాట తప్పిందని ఇండియా నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘ఇండియా’ భేటీ
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖడ్గే అధ్యక్షతన ‘ఇండియా’ నాయకులు రాహుల్‌, డెరెక్‌ ఓ బ్రెయిన్‌ (టీఎంసీ), పి.సంతోశ్‌ కుమార్‌ (సీపీఐ), కె.రాధాకృష్ణన్‌ (సీపీఎం), జాన్‌ బ్రిట్టాస్‌ (సీపీఎం) తదితరులు భేటీ అయ్యారు. ఎస్‌ఐఆర్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. అమెరికా 25 శాతం సుంకం, జరిమానా విధించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని వామపక్షాల నాయకులు సూచించారు. అయితే ఎస్‌ఐఆర్‌పై సర్కారుకు తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. ఎస్‌ఐఆర్‌ కంటే కూడా ఓట్ల చోరీ ప్రక్రియగా దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎవరి భాషల్లో వారు ‘ఓట్ల చోరీ’ని అనువదించి… ఎస్‌ఐఆర్‌ వ్యతిరేక ఆందోళనలు చేపట్టాలని సమావేశం సూచించింది. ఎస్‌ఐఆర్‌పై చర్చ విషయంలో ప్రభుత్వ వైఖరి ఆధారంగా ఈసీ ఎదుట ఆందోళనపై నిర్ణయం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడిరచాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు