Homeజాతీయంధర్మస్థల కేసులో కీలక మలుపు.. సిట్ తవ్వకాల్లో బయటపడ్డ అస్థిపంజరం!

ధర్మస్థల కేసులో కీలక మలుపు.. సిట్ తవ్వకాల్లో బయటపడ్డ అస్థిపంజరం!

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరిపిన తవ్వకాల్లో మానవ అస్థిపంజరం అవశేషాలు, ఒక చీర బయటపడ్డాయి. నేత్రావతి నది సమీపంలోని 11వ నంబర్ ప్రదేశంలో వీటిని కనుగొన్నట్టు అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో కేసు దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఈ కేసులో కీలక సమాచారం ఇచ్చిన విజిల్ బ్లోయర్ (మాజీ పారిశుద్ధ్య కార్మికుడు) సూచనల మేరకు సిట్ అధికారులు తవ్వకాల ప్రదేశాన్ని మార్చారు. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన ప్రాంతంలో కాకుండా విజిల్ బ్లోయర్ కోరికపై 11వ నంబర్ ప్రదేశంపై దృష్టి సారించారు. అక్కడ జరిపిన తవ్వకాల్లో అస్థిపంజరంతో పాటు ఓ చీర లభ్యం కావడంతో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

రికార్డుల మాయంపై తీవ్ర ఆరోపణలు
ఇదే సమయంలో, ఈ కేసుకు సంబంధించి ఆర్టీఐ కార్యకర్త జయంత్ సంచలన ఆరోపణలు చేశారు. బేల్తంగడి పోలీసులు 2000 నుంచి 2015 మధ్య కాలానికి చెందిన అసహజ మరణాల రిజిస్టర్ (యూడీఆర్) నుంచి అన్ని వివరాలను తొలగించారని ఆయన ఆరోపించారు. అనుమానాస్పద మరణాలు ఎక్కువగా నమోదైనట్టు ఆరోపణలు వస్తున్న కాలానికి చెందిన రికార్డులనే తొలగించడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక బాలిక మృతదేహాన్ని చట్టవిరుద్ధంగా, అధికారుల సమక్షంలోనే పూడ్చిపెట్టడం తాను కళ్లారా చూశానని జయంత్ సిట్ బృందానికి ఫిర్యాదు చేశారు.

విజిల్ బ్లోయర్ వాంగ్మూలం
ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు, దర్యాప్తు అధికారి జితేంద్ర కుమార్ దయామా ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తన గుర్తింపును దాచిపెట్టేందుకు నల్లని ముసుగు ధరించి ఆయన అధికారుల ముందుకు వచ్చారు. 1998 నుంచి 2014 మధ్య కాలంలో మహిళలు, మైనర్ల మృతదేహాలను బలవంతంగా పూడ్చిపెట్టారని, వాటిలో కొన్నింటిపై లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది. తాజా పరిణామాలతో సిట్ అధికారులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు