వర్సిటీ వర్గాల్లో అసహనం
రిజిస్ట్రార్ రాజీనామా
విశాలాంధ్ర-విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. రిజిస్ట్రార్… ప్రొఫెసర్ ఈఎన్ ధనుంజయరావు ఆకస్మిక రాజీనామా గందరగోళం సృష్టించింది. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జీపీ రాజశేఖర్ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్, డీన్, అధికారులు, ఆచార్యులతో అంటీ అంటనట్టుగా ఉండటం వివాదానికి కారణమైంది. రిజిస్ట్రార్ సహా ఏ అధికారులైనా అపాయింట్మెంట్ లేకుండా ఆయనను కలవలేరు. వర్సిటీ వందేళ్ల చరిత్రలో ఏ వీసీ ఇలా వ్యవహరించలేదు. ఆయన తీరు యూనివర్సిటీ వర్గాలకు కోపం తెప్పించడమే కాకుండా తీవ్ర విమర్శలకు దారితీసింది. రాజకీయ నాయకులు కూడా వీసీని తప్పుపట్టారు. దీంతో ఓ మెట్టు దిగి తనను కలిసేందుకు యూనివర్సిటీ ఆచార్యులకు, అధికారులకు ఓ సమయాన్ని వీసీ నిర్దేశించారు. పాలనాపరమైన అంశాల్లో మాత్రం ఏకపక్షంగా ఉండటం, ఏ విషయంలోనూ సంప్రదింపులు జరపకపోవడం, మరీ ముఖ్యంగా రిజిస్ట్రార్ పనుల్లో జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. డీన్, డైరెక్టర్ నియామకాలలో వీసీ ఇష్టారీతిని వ్యవహరిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత వీసీలు రిజిస్ట్రార్ అభిప్రాయాన్ని గౌరవించేవారు కానీ వీసీ రాజశేఖర్ అందుకు పూర్తి భిన్నంగా ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులను డమ్మీలుగా మార్చేలా నిర్ణయాలు తీసుకోవడం కలకలం రేపింది. ఐఐటీ తరహాలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘ఫ్యాకల్టీ అఫైర్స్ డీన్’ అనే పోస్టు సృష్టించి, ప్రిన్సిపాల్, విభాగాధిపతులపై పెత్తనానికి ఒకరిని నియమించడం ఆచార్యులకు కోసం తెప్పించింది. సాధారణంగా విద్యా వ్యవహారాలను విభాగాధిపతులు, కళాశాల ప్రిన్సిపాల్స్ చూసుకుంటారు. అలాంటిది ‘ఫ్యాకల్టీ అఫైర్స్ డీన్’ ఉండాలన్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఇందుకోసమే రిజిస్ట్రార్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. సరైన వ్యక్తిని వీసీగా నియమించలేదని, ఇది రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమని వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. ముందు నుంచి వివాదాస్పద వైఖరి అవలంభిస్తున్న రాజశేఖర్న ు కట్టడి చేస్తారా లేదా యూనివర్సిటీ గొడవలు మాకెందుకని వదిలేస్తారా అని ప్రశ్నిస్తున్నాయి.


