- Advertisement -
–ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్‌లో జిల్లాను అగ్రగామిగా నిలపాలి
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విశాలాంధ్ర`విజయవాడ: పారిశ్రామిక రంగానికి సంబంధించి సమన్వయ శాఖలు అందించే అన్ని సేవలపైనా యూజర్లకు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించాలని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. శనివారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జరిగింది. తొలుత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) నిర్వహించే బీఆర్ఏపీ-2024 సర్వేపై పారిశ్రామిక వర్గాలకు అవగాహన కల్పించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకింగ్స్ ఇచ్చే విధానాన్ని, పరిమితులను క్షుణ్నంగా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ ర్యాంకింగ్‌ను మెరుగుపరిచేందుకు వీలుగా ప్రతి శాఖా ద్వారా సేవలు పొందిన వారికి సింగిల్ విండో వ్యవస్థతో పాటు వివిధ ఆన్లైన్ సేవలు వంటివాటిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించాలన్నారు. ముఖ్యంగా వాణిజ్యం, లేబర్ డిపార్టుమెంట్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, పరిశ్రమలు తదితర శాఖలు దీనిపై దృష్టిపెట్టాలన్నారు. వివిధ అనుమతులకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 29 వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 2,958 దరఖాస్తులు రాగా 2,921 దరఖాస్తులు పరిష్కారమయ్యాయని, మిగిలిన వాటిని నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా వివిధ పారిశ్రామిక అభివృద్ధి విధానాల కింద పది క్లెయిమ్‌లకు రూ. 1.52 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలకు కమిటీ ఆమోదం తెలిపింది. పరిశ్రమల ఏర్పాటుకు అత్యుత్తమ వాతావరణం రాష్ట్రంలో ఉందని.. ఔత్సాహికులు పెద్దఎత్తున పెట్టుబడులతో ముందుకు రావాలన్నారు. 2025-26కు సంబంధించి పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ పథకాల అమల్లో పురోగతిని కమిటీలో చర్చించి దరఖాస్తులను త్వరిగతిన పరిష్కరించేందుకు, యూనిట్ల ప్రారంభానికి కలెక్టర్ లక్ష్మీశ దిశానిర్దేశం చేశారు. రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్)కు సంబంధించి మండల ప్రధాన కేంద్రాల్లో షెడ్యూల్ ప్రకారం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్‌షాప్‌లను నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి ఆర్.వెంకటరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, ఎల్డీఎం కె.ప్రియాంక, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, పారిశ్రామిక అసోసియేషన్ల ప్రతినిధులు, సర్వీస్ యూజర్లు తదితరులు పాల్గొన్నారు.


