పడకేసిన బుడమేరు ఆధునీకరణ...అమలు చేయడంలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదు…నిధులు కొరత అంటూ మంత్రి వ్యాఖ్యలు హాస్యస్పదం....మూడు జిల్లాల లక్షలాది ప్రజల ప్రాణాలతో చెలగాటమా…..?సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆగ్రహాం
విశాలాంధ్రవిజయవాడ:ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదని, మూడు జిల్లాలతో ముడిపడి ఉన్న బుడమేరును పట్టించుకోకుండా ప్రక్కన పెట్టేశారని సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఫైర్ అయ్యారు. బుడమేరు ముంపుతో విజయవాడ ప్రజలు సర్వం కోల్పోయి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అపరేషన్ బుడమేరు, పూడికతీత పనులను చేపట్టి ఆధునీకరిస్తామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నీటిములుగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. ఈ సంవత్సర కాలంలో బుడమేర పరివాహక ప్రాంతం దాదాపుగా 167కిలోమీటర్లు పర్యటించి ముంపుకు గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలించి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేపట్టామని, అంతేకాకుండా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ నాయకత్వంలో స్వయంగా సీఎం చంద్రబాబును కలిసి నివారణ చర్యలను చిత్రాలను ప్రదర్శించి, లిఖితపూర్వకంగా వివరించడం జరిగిందన్నారు. దీంతో సీపీఐ పోరాటంతో లక్షలాదిమంది ప్రజలకు న్యాయం జరుగుతోందని భావించామని, నెలలు గడుస్తున్న బుడమేరు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం దారుణమన్నారు. కేవలం 450మీటర్ల సైడ్ గోడను నిర్మించి బుడమేరు ముంపును పూర్తిస్ధాయిలో అరికట్టామని పెద్దఎత్తున ప్రచారం చేసుకోవడం తప్పితే శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇది కేవలం ఒక్క విజయవాడ సమస్యకాదని, మూడు జిల్లాల్లో ఉన్న 80లక్షల ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య అన్ని రకాలుగా నష్టపోతున్నవారికి న్యాయం చేయరా అని నిలదీశారు. ఆధునీకరిస్తామని చెప్పడం తప్పితే సమస్య పరిష్కారం కోసం బుడమేర కాలువ వెంబడి ఉన్న ఆక్రమణలు పూడికతీతలు తొలగించకుండా అపరేషన్ బుడమేరు ఎలా సాధ్యమవుతందని ప్రశ్నించారు. జిల్లాలోని ఎనికేపాడు అండర్టన్నెల్ నుండి 14వేల కూస్కెక్కులు నీరు దిగువుకు వెళ్లవలసి ఉండగా ఆక్రమణలతో పెద్దఎత్తున పూడుకుపోయిన కాలువ ద్వారా కేవలం 4వేల కూసేక్కులు నీరు మాత్రమే దిగువకు వెళ్తోందన్నారు.. ఈ బుడమేరు వెంబడి దాదాపుగా 20వేల కూసెక్కులు నీరు దిగువకు వేళ్లే సామర్ధ్యం ఉన్నా పాలకులు, అధికారులు అసమర్ధతతో పూర్తిస్ధాయిలో దిగువకు నీరు చేరుకోని పరిస్ధితి దాపురించిందన్నారు. దీంతో ప్రజలు పలు దఫాలుగా తీవ్ర నష్టానికి గురై సర్వం కోల్పోతున్నారని వివరించారు. ఎక్కడో ఏ కొండూరులో పుట్టిన బుడమేరు ఎగువన పలు ప్రాంతాల ప్రవహిస్తూ కేసరపల్లి, మంతెన, వేల్పురు, ఉప్పులూరు, గుడివాడ, కోల్లేరు నుండి సముద్రంలోకి కలుస్తోందని తెలిపారు. పెద్దఎత్తున పూడుకుపోవడంతో ఎగువన ప్రవహించే వరదతో బుడమేరు దిగువున ఉన్న ప్రాంతాలు ముంపుకు గురువుతున్న పరిస్ధితి నెలకొందన్నారు. ఈ కారణంగా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా, సమస్యను ప్రక్కదారి పట్టిస్తూ ప్రజలకు తీరని నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఆపరేషన్ బుడమేరు అమలు చేయడానికి నిధులు కొరత ఉందని స్వయంగా నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామనాయుడు మాటలు హాస్యస్పదంగా ఉన్నాయని అన్నారు. దాదాపుగా రూ 80వేల కోట్లు పలు విధాలుగా అప్పులు తీసుకుని అమరావతి రాజధాని నిర్మాణానికి ఖర్చుచేస్తున్నారని, లక్షలాది ప్రజలకు తీరని నష్ట కలుగజేస్తున్న బుడమేరును ఆధునీకరించడానికి నిధులేవా అని ప్రశ్నించారు. అప్పులో అప్పు కేవలం రూ.5వేల కోట్లు ఆపరేషన్ బుడమేరును అమలు చేస్తే లక్షలాది ప్రజలు సుభిక్షంగాను, క్షేమంగా ఉంటారని అన్నారు. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసే దిశగా పనులు చేపట్టాలని లేనిపక్షంలో ప్రతిసారి బుడమేరుతో నష్టపోత్తున్న ప్రజల పక్షంగా కొంతుకై సీపీఐ పక్షంగా పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని దోనేపూడి శంకర్ హెచ్చరించారు.


