ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ 15న ధర్నా...
సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్
విశాలాంధ్ర`విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్త్రీ శక్తి పథకం ఆటో కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. నగరంలోని దాసరిభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న ఆటో కార్మికులు ఉపాధి కరువై భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందన్నారు. గత ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని జీవో నెంబర్ 21 ను రద్దు చేస్తామని దాని స్థానంలో కొత్త జీవో, తెస్తామని, ఆటో కార్మికులకు హెల్త్ మరియు ప్రమాద బీమా సౌకర్యం కలుగజేస్తామన్నారు. వాహన మిత్ర పథకం ద్వారా సంవత్సరానికి రూ 15 వేలు ఆర్థిక సహాయం, ఆటో కార్మికుల పిల్లలకు ఉన్నత విద్యకు విద్య రుణాలు అందిస్తామని స్వయంగా చంద్రబాబునాయుడు గత ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేయటం జరిగిందని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిన ఈనాటి వరకు హామీలు ఆచరణకు నోచుకోలేదని పేర్కొన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన శ్రీ శక్తి పథకం సగటు పౌరులుగా స్వాగతిస్తున్నామని ప్రకటించారు. ఇదే సందర్భంలో ఇప్పటికే అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ఇంధన ధరలు, నిబంధన పేరుతో అధికారిక వేధింపులు, ప్రైవేటు ఫైనాన్స్ దోపిడీ, ఆన్లైన్ బుకింగ్స్ పేరుతో ఓలా, రాపిడో తదితర సర్వీసులు ఆటో కార్మికుల నడ్డివిరుసుతున్నా ఇప్పటికీ ఆటో కార్మికుల పట్ల వారి జీవనోపాధిపట్ల ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించలేదన్నారు. ఈ సందర్భముగా ప్రతి ఆటో కార్మికునికి నెలకు రూ.5000 పింఛన్ రూపంలో మంజూరు చేయాలని, బ్యాడ్జితో సంబంధం లేకుండా వాహన మిత్ర పథకం మంజూరు చేసి ఆటో కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఈ సెప్టెంబర్ 15వ తేదీన ఆటో కార్మికులు నగరంలో రవాణా శాఖ మంత్రి కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకతీతంగా ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలనీ దోనేపూడి శంకర్ పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి గూడేల జనార్దన్, యూనియన్ నాయకులు పి.సుబ్రహ్మణ్యం, కమ్మిలి శ్రీను చారి, ఎం.ఆత్మారాం, నాగేశ్వరరావు, షేక్ అహ్మద్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.


