కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు...
జిల్లా కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరిక…
విశాలాంధ్ర`విజయవాడ: నందిగామ పట్టణంలో బుధవారం గ్రోమోర్ ఎరువులు, పురుగు మందుల దుకాణాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తనిఖీ చేసి, అమ్మకాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఎరువుల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎరువుల పంపిణీకి సంబంధించి ప్రతి లెక్కా చాలా పక్కాగా ఉండాలని ఎక్కడ ఎలాంటి ఫిర్యాధులు రానీయరాదన్నారు. ఎరువులు సరఫరాపై ఫిర్యాదులు లేదా సమాచారం అందించేందుకు ప్రతి షాపు వద్ద 91549 70454 నంబరును బోర్డులో ప్రదర్శించాలన్నారు. ఎరువుల వివరాలు వాటి ధరలు, ఇప్పటి వరకు జరిగిన అమ్మకాల వివరాలను నోటీస్ బోర్డు నందు తప్పని సరిగా పొందుపరచాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.వ్యవసాయ అధికారుల సూచనల మేరకే ఎరువులను సరైన విధంగా వినియోగించాలని, ఎరువులను అధిక ధరలకు అమ్మడం, ఇతర ప్రయోజనాలకు మళ్ళించడం వంటి వాటివి తారసపడితే వెంటనే సమాచారం అందించాలని కలెక్టర్ అన్నారు.
48,158 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు సరఫరా..
జిల్లాలో ప్రస్తుత ఖరీప్ సీజన్‌కు బుధవారం సాయంత్రం 6 గంటలకు మొత్తం 48,158 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. రైతులకు ఎటువంటి కొరత లేకుండా పారదర్శకంగా ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు ,ఎవరైనా అవకతవకులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని క హెచ్చరించారు. అన్ని రకాల 21,289 మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎరువులు వివరాలు..
1) యూరియా : 3,474 మెట్రిక్ టన్నులు
2) డీఏపీ : 1,311 మెట్రిక్ టన్నులు
3) మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ) : 1,246 మెట్రిక్ టన్నులు
4) ఎన్పీకే : 12,948 మెట్రిక్ టన్నులు
5) ఎస్ఎస్పీ : 2,195 మెట్రిక్ టన్నులు
6) కంపోస్ట్ : 83 మెట్రిక్ టన్నులు
7) ఎఫ్‌వోఎం : 30 మెట్రిక్ టన్నులు
మొత్తం : 21,289 మెట్రిక్ టన్నులు


