విశాలాంధ్ర – నార్పల :- మండలంలో కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్ జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు ఇంకా అందక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు,నాయకులు మొదటగా స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీలో హడావిడి చేసిన తర్వాత ఆ హడావిడి ఎక్కడ కనపడలేదు.స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ గందరగోళంగా తయారైంది.స్మార్ట్ రేషన్ కార్డులను సచివాలయాల్లోనే తీసుకోవాలని అధికారులు ముందుగా ప్రకటించడంతో కార్డుదారులు సచివాలయాలకు పరుగులు పెట్టారు.అయితే సచివాలయం సిబ్బంది వివిధ పనుల పేరుతో బిజీబిజీగా ఉంటున్నారు. మరికొన్ని గ్రామ సచివాలయాల్లో వీఆర్వో, రేషన్ డీలర్ వద్ద కొన్ని స్మార్ట్ రేషన్ కార్డులు సచివాలయంలో కార్డులన్నీ ఒకచోట పడేసి లబ్ధిదారులను వెతుక్కోవాలని చెబుతున్నారు. ఒకరి కార్డు మరొకరు తీసుకెళుతున్నారు. ఇంటికి వెళ్లి చూసుకున్న తర్వాత ఆ కార్డు తమది కాదని మళ్లీ సచివాలయాలకు తీసుకొస్తున్నారు. దీంతో ప్రజలు రేషన్ కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కార్డు ఎక్కడ ఉందో తెలియక లబ్ధిదారులు పాట్లు పడుతున్నారు.చాలా వరకు స్మార్ట్ రేషన్ కార్డుల్లో అక్షరదోషాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మంజూరైన కార్డులను గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు రేషన్ డీలర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి కార్డులు పంపిణీ చేసేలా ఆయా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేశారు. సచివాయల ఉద్యోగులు తూ తూ మంత్రంగా పంపిణీ చేస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కానీ ఇంతవరకు ఇంటి ఇంటి వెళ్ళి స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేసారో లేదో తెలియడం లేదు. ఏది ఏమైనా స్మార్ట్ రేషన్ కార్డు లు గందరగోళం లేకుండా ప్రజలందరికీ సక్రమంగా పంపిణీ చేసేలా మండల అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


