హైకోర్టులో వాదనలు వినిపించాలని అభిషేక్ సింఫ్వీుని కోరిన సీఎం రేవంత్
విశాలాంధ్ర – హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై అడుగడుగునా జాగ్రత్తలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం… సుప్రీంకోర్టు, హైకోర్టులోను కేసు గెలిచేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతోంది. సోమవారం సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి బృందం ముందు రోజే దిల్లీ వెళ్లి న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులతో చర్చించింది. బీసీ రిజర్వేషన్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సోమవారం సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయ కోవిదుడు అభిషేక్ సింఫ్వీు, సిద్ధార్థ దవేలు హాజరు కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తోపాటు మంత్రుల బృందం సుప్రీంకోర్టుకు వెళ్లి వాదనలు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. బీసీ రిజర్వేషన్ల కేసుపై ఈనెల 8న విచారణ జరగనున్న నేపథ్యంలో స్వయంగా కోర్టుకు హాజరు కావలసిందిగా న్యాయ కోవిదుడు అభిషేక్ సింఫ్వీుని ఫోన్లో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కోరారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం సింఫ్వీుని ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు.


