సబ్సిడీ రుణాల పథకం అటకెక్కనుందా?
రుణాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత.
విశాలాంధ్ర – కొవ్వూరు : నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీనిలో భాగంగా బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ తదితర కార్పొరేషన్ల పేరిట దరఖాస్తులను ఆహ్వానించి పట్టణాలలో మున్సిపాలిటీలకు, గ్రామాలలో అయితే మండల పరిషత్ కార్యాలయాలకు ఆన్లైన్ చేసిన తర్వాత అందచేయాలని ప్రభుత్వం ప్రకటించింది, ఈ మేర నిరుద్యోగ యువత ఎంతో ఆశలు పెంచుకొని దరఖాస్తులు ఆన్లైన్ చేసి మున్సిపాలిటీలకు, మండల పరిషత్ కార్యాలయాలకు అందజేశారు. దీనికి గాను మార్చి 25వ తేదీని చివరి తేదీన ప్రకటించారు. గడువులోపల దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను అందజేశారు. అనంతరం మున్సిపాలిటీలలో కమిషనర్లు, గ్రామానికి సంబంధించి మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీడీవోలు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం ఈ దరఖాస్తులను సంబంధిత బ్యాంకులకు పంపించారు. ఎక్కడ వరకు బాగానే ఉంది ఆ తర్వాత దరఖాస్తుదారులు తాము ఎంచుకున్న బ్యాంకులకు దరఖాస్తుల వెళ్లడంతో బ్యాంకులు చుట్టూ ప్రదక్షణ చేస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో బ్యాంకులు ఇవ్వడానికి రుణాలు ఇవ్వడాన్ని పెండింగ్లో పెట్టింది. ఆ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ వర్గాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి వాటిని స్వీకరించారు. ఎలా మొత్తం అన్ని కార్పొరేషన్ నుంచి దరఖాస్తులు స్థానిక సంస్థల ద్వారా బ్యాంకులకు చేరాయి గాని రుణాల మంజూరుకు నోచుకోక బ్యాంకుల వద్ద దరఖాస్తులు ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ల అధికారులను ఆరా తీస్తే సబ్సిడీ విషయంలో కార్పొరేషన్ల విషయంలో కొంతమేర తేడా ఉండడంతో రుణాల ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసిందని, త్వరలోనే ప్రభుత్వ నుంచి అనుమతి వస్తుందని చెబుతున్నట్లు సమాచారం.
ఎంతో చేస్తుందని ఊహించి..
వైకాపా ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరల మనకి మంచి రోజులు వచ్చాయని నిరుద్యోగ యువత చాలామంది భావించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రుణాలకు బదులు కులాల పేరిట సంవత్సరానికి 15000 చొప్పున లబ్ధిదారుల ఖాతాలో వేస్తూ వచ్చారు. అయితే కూటమిప్రభుత్వం వచ్చిన తర్వాత 50 శాతం సబ్సిడీతో బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తామని, ఈ సొమ్ముతో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని నిరుద్యోగ యువత ఉపాధి పొందుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆర్భాటం ఘణం.. ఆచరణ శూన్యం అన్నట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని నిరుద్యోగ యువత దుమ్మెత్తి పోస్తోంది. అదేవిధంగా సబ్సిడీ రుణాల కోసం వ్యక్తిగత వయస్సు 60 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్ణయించడంతో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు కూడా ఈ రుణాలపై ఆశలు పెంచుకుని దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం, అధికారులు ప్రకటించిన లక్ష్యాలకు పదింతలకు పైగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. ఈ నేపద్యంలో దరఖాస్తుదారుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లినట్లు అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సబ్సిడీ రుణాల విషయమై త్వరితగతిని నిర్ణయం తీసుకుంటే తమ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని రుణాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


