మార్కండేయ స్వామి ఆలయంలో
మాజీ ఎంపి భరత్ లక్ష బిళ్వార్చన
విశాలాంధ్ర – రాజమండ్రి సిటి : మాస శివరాత్రిని పురస్కరించుకుని స్థానిక మార్కండేయ స్వామి వారి ఆలయంలో మాజీ ఎంపి భరత్‌రామ్ ఆదివారం లక్ష బిళ్వార్చన పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆయన గోదావరిలో పవిత్ర పూజలు నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రాల మధ్య అత్యంత శాస్త్రోక్తంగా జరిగిన లక్ష బిళ్వార్చన కార్యక్రమంలో భరత్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ రామ్ మాట్లాడుతూ గోదావరి కలుషితం కావడం, కనీసం ఘాట్ల పరిశుభ్రదత చేయక పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీపావళి ముగిసిన వెంటనే కార్తీక మాసం ప్రారంభం అవుతుందని అప్పటిలోగా కొత్తగా వచ్చిన కమిషనర్, జిల్లా కలెక్టర్ ఘాట్లను పరిశుభ్రం చేయించాలని కోరారు. లక్షలాదిమంది భక్తులు కార్తీక మాసం సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరిస్తారని, కనుక ఘాట్లు, పవిత్ర గోదావరి జలాలు కలుషితం కాకుండా చూడాలని కోరుతూ ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రతి ఏడాది మాస శివరాత్రి నాడు తమ కుటుంబం మార్కండేయ స్వామి ఆలయం లో క్రమం తప్పకుండా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుందని రాష్ట్ర బిసి ఐక్య వేదిక నేత మార్గాని నాగేశ్వర రావు అన్నారు. ప్రజలంతా నరకాసురుడి వధ జరిగిన నరక చతుర్ధశి రోజును , దీపావళిని సంతోషంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.


