Homeమహాగట్బంధన్‌ సీఎం అభ్యర్థిగాతేజస్వీ యాదవ్‌

మహాగట్బంధన్‌ సీఎం అభ్యర్థిగాతేజస్వీ యాదవ్‌

- Advertisement -

. కాంగ్రెస్‌ నేత గెహ్లాత్‌
. ఆర్జేడీ, కాంగ్రెస్‌ మధ్య సమసిన విభేదాలు
. డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముకేశ్‌ సహానీ

పట్నా: బీహార్‌ రాజకీయాల్లో కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడిరది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష మహాగట్బంధన్‌ (ఇండియా ఐక్యసంఘటన) ముఖ్యమంత్రి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ఆర్జేడీ యువనేత, బీహార్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీయాదవ్‌ నాయకత్వంలోనే కూటమి ఎన్నికల బరిలోకి దిగనుందని, కూటమి అధికారంలోకి వస్తే తేజస్వీనే సీఎం అవుతారని స్పష్టం చేసింది. తద్వారా అధికార ఎన్డీయే కూటమికి సవాల్‌ విసిరింది. ఈ మేరకు గురువారం పట్నాలోని మౌర్య హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, బీహార్‌ కాంగ్రెస్‌ ఎన్నికల ఇంఛార్జ్‌ అశోక్‌ గెహ్లాత్‌… కూటమి భాగస్వామ్య పక్షాల నేతల సమక్షంలో తేజస్వీ యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) నేత ముకేశ్‌ సహానీ పేరును కూడా ఆయన ప్రకటించారు. త్వరలోనే మరో డిప్యూటీ సీఎం అభ్యర్థిని కూడా ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగా గెహ్లాత్‌ మాట్లాడుతూ… ‘తేజస్వీ యాదవ్‌ యువ నాయకుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి. ఆయనకు సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంది. అందుకే, ఆయన నాయకత్వంలోనే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని మేమంతా నిర్ణయించాం’ అని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, ఇక్కడున్న భాగస్వామ్య పార్టీలతో చర్చించిన తర్వాతనే తేజస్వీ యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ఖరారు చేసినట్లు గెహ్లాత్‌ స్పష్టం చేశారు. ‘ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించా. ఆయన యువకుడు, ఎంతో భవిష్యత్‌ ఉంది. నేను అనుభవంతో చెబుతున్నాను. ఆయనకు చాలా భవిష్యత్తు ఉంది. ప్రజలు ఆయనతో ఉన్నారు. ఆయన సంకల్పం ఉన్న యువకుడు. ఉద్యోగాలు, ఇతర హామీలపై ఆయన ఏం చెప్పారో దానికి కట్టుబడి ఉంటారు. ఎన్‌డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలి’ అని గెహ్లాత్‌ సవాల్‌ విసిరారు. అనంతరం తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతూ 20 ఏళ్లలో చేయని పనిని 20 నెలల్లో చేసి చూపిస్తానన్నారు. కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాదు…బీహార్‌ అభివృద్ధి కోసం అందరం చేతులు కలిపినట్లు తెలిపారు. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించినందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖడ్గేకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీహార్‌ను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఎన్డీయే పాలనలో అవినీతి పేరుకుపోయిందని మండిపడ్డారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌లో రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం, కేంద్రంలో అసమర్థ ప్రభుత్వం నడుస్తోందని దుయ్యబట్టారు. ఎన్డీయే ఇంతవరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్‌కుమార్‌ను ప్రకటించారని, ఇప్పుడు ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది కాబట్టే ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం లేదన్నారు. అవినీతి, నేరం అనే ఎన్‌డీయే డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత జేడీయూ ఉండదన్నారు. ‘బీజేపీ తదుపరి సీఎంగా నితీశ్‌ కుమార్‌ను చేయదని మేం చాలా రోజులుగా చెబుతున్నాం. దీనిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా స్వయంగా ధ్రువీకరించారు. నేను నమ్మకంగా చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే… ఐదు సంవత్సరాలు కాదు. బీహార్‌ ప్రజలు మాకు 20 నెలలు ఇస్తే… వీరు 20 సంవత్సరాలలో చేయని పనిని పూర్తి చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగం లేకుండా కుటుంబం ఉండదని మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం’ అని తేజస్వీ యాదవ్‌ పేర్కొన్నారు. 35 ఏళ్ల తేజస్వీ యాదవ్‌ బీహార్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. గతంలో ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వయసు మీదపడటంతో పాటు వివిధ కేసుల్లో ఆయన చిక్కుకున్న అనంతరం, పార్టీ బాధ్యతలను తేజస్వీ సమర్థంగా నిర్వహిస్తున్నారు. బీహార్‌లో ఇండియా కూటమి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.
సీట్ల పంపకాలు, సీఎం అభ్యర్థిత్వంపై ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. 2020 ఎన్నికల్లో కేవలం 19 సీట్లు గెలిచినప్పటికీ, ఈసారి కూడా తమకు 70 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ పట్టుబట్టింది. అయితే, కాంగ్రెస్‌ గత ప్రదర్శన దృష్ట్యా అన్ని సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సుముఖత చూపలేదు. దీంతో కూటమిలో ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి విదితమే. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగంలోకి దిగింది. సమస్య పరిష్కార బాధ్యతను అశోక్‌ గెహ్లాట్‌కు అప్పగించింది. బుధవారం పట్నాకు చేరుకున్న ఆయన… లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్డీదేవి, తేజస్వీ యాదవ్‌లతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగానే కూటమిలోని అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, అందరం కలిసికట్టుగా ఎన్నికల్లో పోరాడతామని గెహ్లాట్‌ ప్రకటించారు. తాజా ఒప్పందం ప్రకారం ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ నిర్ణయంతో నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కొనేందుకు మహాకూటమి ఐక్యంగా సిద్ధమైనట్టయింది. ఈ పరిణామం కూటమి ప్రచారానికి కొత్త ఊపునిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు