– సందడిగా మారిన పుట్టలు ప్రదేశాలు
విశాలాంధ్ర – రాజానగరం : నాగయ్య నాగప్ప నాగరాజా మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా అంటూ పల్లె, పట్టణం తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. దీపావళి వెళ్లిన తర్వాత వచ్చే నాగుల చవితి పర్వదినం నాడు పాముపుట్టలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చెయ్యడం అనవాయితీగా వస్తుంది. సర్ప దోషాలు నివారణకు, సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు ప్రతీతి గా నిలుస్తుందని భక్తులు వాపోయారు.మండల కేంద్రమైన రాజానగరంతో పాటు వివిధ గ్రామాల్లో శనివారం వేకువ జాము నుండి సొంత పొలాల్లో, సైట్లులో ఏర్పడి ఉన్నా సహజ పుట్టలు, పాము కలుగుల్లో ఆవు పాలు, కోడి గుడ్లు, చిమిలి,చలివిడి, వడపప్పు, తదితర తిను బండారాలు నైవేద్యంగా వేసి మొక్కలు చెల్లించుకున్నారు. దీనిలో భాగంగా నాగయ్య నాగప్ప నాగరాజా మా ఆశలన్ని తీర్చవయ్య నాగరాజా శివయ్య మెడలోనా నాగరాజా. నీకు కమ్మని పాలు తెచ్చామయ్యా నాగరాజా అంటూ పాటలు పాడి భజనలు చేశారు. అలాగే టపాసులు కాల్చారు. అనంతరం స్నేహితులు, బంధువుతో కలిసి అల్పాహారం సేవించారు.దీంతో ఆయా ప్రాంతాల్లో సందడి వాతావరణం సంతరించుకొంది.


