రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం
రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి
– రైతులు ధైర్యం కోల్పోవద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది
విశాలాంధ్ర – సీతానగరం: తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతీ రైతును అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది అని రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. బుదవారం మండలంలో చినకొండేపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో నేలకొరిగిన వరి పంట పొలాలను తహసిల్దార్ ఏ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ ఏ ఈ గురుప్రియ ఆధ్వర్యంలో రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు. దీనిలో భాగంగా రైతులతో పంట నష్టం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే అధికారులను ప్రతీ రైతుకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటామని హామీ ఇస్తూ, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని అన్నారు.అలాగే నష్టపోయిన ప్రతి ఎకరాకు ఇన్‌పుట్ సబ్సిడీ (నష్టపరిహారం) వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు తక్షణం ఉమ్మడిగా సర్వే నిర్వహించి, నియోజకవర్గంలోని పంట నష్టం వివరాలతో కూడిన వాస్తవ నివేదికను ప్రభుత్వానికి పంపాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గెడ్డం తిమ్మరావు, సొసైటీ అధ్యక్షుడు కాండ్రు శేఖర్, సీనియర్ నాయకులు గద్దె వెంకటకృష్ణ చౌదరి (నల్లి), వలవల రాజా, కాండ్రు కాశి విశ్వనాథo, సింగవరం సర్పంచ్ సంగన చినపోసియ్య, సురేష్, పృధ్వీ, వి ఆర్ ఓ రమేష్, వి ఏ ఏలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


