

విశాలాంధ్ర – కడియం : కడియం మండలంలోని పలు గ్రామాలలో వీధి కుక్కల స్వైర విహారంతో పెద్దల నుండి పిల్లల వరకు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. బయటకు వెళ్ళాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కుక్కలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులను పాఠశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ 1, 2025 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు దాదాపుగా 700 మంది కుక్కకాటుకు గురై కడియం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు రికార్డుల ద్వారా తెలియ వచ్చింది. ఒక్క కడియం ప్రభుత్వ ఆసుపత్రిలోనే కుక్కకాటుకు గురైన వారి సంఖ్య ఈ స్థాయిలో ఉంటే, ప్రైవేట్ ఆసుపత్రులు మరియు మండలానికి సమీపంలో వున్న ప్రభుత్వ ఆసుపత్రులు, పెద్దఆసుపత్రుల్లో కుక్క కాటుకు చికిత్స పొందిన వారి సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ద్విచక్ర వాహనాలు, సైకిల్ పై వెళుతున్న వారిని కుక్కలు వెంబడించి తరవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవడమే కాకుండా, కుక్కకాటుకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనిని బట్టి ప్రజలు, చిన్నారులపై కుక్కలు చేస్తున్న దాడులు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సంబంధింత అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుని వెళ్ళినా ఫలితం ఉండడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు నియంత్రణకు చర్యలు చేపట్టాలని, కుక్కల దాడుల నుంచి రక్షించాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. గ్రామాల్లో ఉన్న కుక్కలను గుర్తించి వాటిని ఆధీనం లోకి తీసుకుని పశుసంవర్ధక శాఖ వైద్యులు, సిబ్బంది ద్వారా కుటుంబ నియంత్రణ ( మగ కుక్కలకు వేసెక్టమి, ఆడ కుక్కలకు ఓవరియో హిస్టరెక్టమి ఆపరేషన్ లు) యాంటీ రేబిస్ వాక్సిన్ లు వేయించడం, తద్వారా కుక్కల ఉత్పత్తిని నియంత్రించడం వంటి బాధ్యతలను అధికార యంత్రాంగమే నిర్వహించాలి. కానీ కుక్కలను నిర్మూలించడం (చంపడం) సాధ్యంకాదనే కుంటి సాకుతో అధికారులు, ప్రజాప్రతినిధులు చేతులెత్తేసి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక పశుసంవర్ధక శాఖ తీరు చూస్తుంటే కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకన్నట్లుంది. కడియం మండలంలో గల 11 గ్రామాల్లో కలిపి 2024–2025 సంవత్సరానికి గాను సుమారు 360 కుక్కలున్నట్లు అధికారిక గణాంకాల సమాచారం. అసలు మండలంలోని గ్రామాల్లో కుక్కల గుర్తింపు గణన జరిగిందా? లేదా? అనే ప్రశ్నలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే మండలంలో వేల సంఖ్యలో కుక్కలు ఉంటాయని, ఒక్కొక్క గ్రామంలో వందల సంఖ్యలో ఉంటాయని పలువురు బహిరంగంగా పేర్కొంటున్నారు. సేకరించిన సమాచారం మేరకు కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేయాలంటే, ప్రాంతీయ పశువుల ఆసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్లు ఉండాలి. అలాగే ఆపరేషన్ అనంతరం వారం రోజులు పరిశీలన, సంరక్షణ చేపట్టాల్సిఉంటుంది. ఒక్కో ఆపరేషన్ నిమిత్తం సుమారు 1600 రూపాయల ఖర్చు అవుతుంది. స్థానిక సంస్థలు (పంచాయతీలు) నిధులు సమకూర్చవలసి ఉంటుంది. రాజమహేంద్రవరం, కాకినాడ నగర కార్పొరేషన్ ల పరిధిలో నియంత్రణ చర్యలు చేపట్టినట్లు, మరిన్ని మున్సిపాలిటీల్లో కూడా చర్యలు చేపట్టదలిచినట్లు తెలియ వచ్చింది. గ్రామాల్లో నివసించే ప్రజలకు కనీసం మౌలిక వసతులు, ఆరోగ్య వసతులు, రక్షణ తదితర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత స్థానిక సంస్థలు (పంచాయతీ) అధికారులు, ప్రజాప్రతినిధులు పై ఉంటుంది. అలాగే కుక్కల నియంత్రణ, వాటి నుండి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అదేవిధంగా వారు చేపట్టే చర్యలకు, తీసుకునే నిర్ణయాలకు కూడా ప్రజలు సహకరించవలసి ఉంటుంది.


