ఉరవకొండ, విశాలాంధ్ర: తమ గ్రామాలకు బస్సు సర్వీసులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పలువురు ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు శుక్రవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో ముందు రాస్తారోకో నిర్వహించారు.పాల్తూరు, దర్గా హోన్నూరు, గోవిందవాడ, బొల్లనగుడ్డం, కలవల్లతిప్ప గ్రామాల విద్యార్థులు మాట్లాడుతూ..ఉరవకొండ నుంచి తమ గ్రామాలకు సకాలంలో బస్సులు లేక పోవడంతో కళాశాలలకు చేరడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న కొద్ది సర్వీసులు కూడా నిర్లక్ష్యంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు.సమస్యపై పలుమార్లు విన్నవించినా స్పందన రాకపోవడంతో ఆందోళనకు దిగినట్లు విద్యార్థులు తెలిపారు. డిపోలోకి బయటి బస్సులు రాకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తర్వాత ఆర్టీసీ అధికారులు సంబంధిత గ్రామాలకు సర్వీసులు మెరుగుపరుస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాస్తారోకో విరమించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థి సంఘాల నాయకులు అరుణ్ రషీద్, రాజేష్, కిరణ్ కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


