విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ లను రద్దు చేయాలంటూ బుధవారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో ఏఐటీయూసి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, ఏఐటీయూసి మండల కార్యదర్శి తలారి బాబు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్పోరేట్లకు అనుకూలంగా కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలన్నారు. బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన శ్రమ శక్తి నీతి విధానాన్ని వెనక్కి తీసుకోవాలని 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ప్రపంచ కార్పోరేట్ శక్తుల లాభాల కొరకు బ్రిటీష్ కాలం నుండి భారతదేశం కార్మిక వర్గం త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులకు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్ లను నవంబరు 21వ తేదీ నుండి అమలు చేయాలని గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం దుర్మార్గమైన విషయమన్నారు. ఇది భారతదేశ చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుందని తక్షణమే లేబర్ కోడ్ లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు డోలు హనుమంతు, నాగరాజు, కుంటి బుజ్జి, రామాంజనేయులు, రాము తదితరులు పాల్గొన్నారు.


