సూపర్ సిక్స్ పథకాలు అమలులో కూటమి ప్రభుత్వం విఫలం…
విశాలాంధ్ర, తాడిపత్రి:రాబోయే స్థానిక ఎన్నికల్లో సిపిఐ పార్టీ బలంగా పోటీ చేసి, విజయం సాధించేందుకు నాయకులు, సభ్యులు, ప్రజలు కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని కొత్త కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్‌లోని మంగల్య కళ్యాణ మండపంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టి. రంగయ్య అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, పెద్దవడుగూరు సీనియర్ నాయకులు సూర్యనారాయణ రెడ్డి, మండల కార్యదర్శులు వెంకట్ రాముడు యాదవ్, చిరంజీవి యాదవ్, రఫీ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన కొనసాగుతోందని, ఎన్నికల్లో కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేసి మిగతా పథకాలను వదిలేసిందని విమర్శించారు.అలాగే, రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయలేదని ప్రభుత్వాన్ని ధ్వజమెత్తారు. నిరుపేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసేంత వరకు సిపిఐ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు.సిపిఐ పార్టీ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 10న జిల్లాలో నిర్వహించే పోరాటయోధుల కుటుంబాల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు నాగేంద్ర, శ్రీరాములు, మండల కార్యదర్శి నాగ రంగయ్య, కొలిమిగుండ్ల రైతు సంఘం నాయకుడు ఎల్ఐసి పుల్లయ్య, రైతు సంఘం నాయకుడు నారాయణరెడ్డి, వెంకటరమణ, రత్నయ్య, అబ్రహం పాల్గొన్నారు.


