-రూ.6లక్షలు నష్టపోయిన కురుబ బుల్లే గంగాధర్
విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రం రాప్తాడు గ్రామానికి చెందిన కురుబ బుల్లే గంగాధర్ కు చెందిన 38 పొట్టేళ్లు విష ద్రావణం (యూరియా మిక్సింగ్) తాగి అకాల మరణం చెందాయి. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే గంగాధర్ వృత్తిరీత్యా గొర్రెల పెంపకం కూడా చేసేవాడు. తోటలో వేసిన మొక్కజొన్న పంటకు శుక్రవారం యూరియా కలిపిన నీరు వదిలాడు. కొద్దిసేపటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తర్వాత కరెంటు సరఫరా రాగానే గొర్రెలకు నీరు తాగించేందుకు తొట్టెల్లోకి పైపు ద్వారా వదిలాడు. అంతకుముందే పైపుల్లో యూరియా ద్రావణం మొక్కజొన్న పంటకు వదిలి ఉండడంతో అందులో ఇంకా మిగిలి ఉన్న ద్రావణం గొర్రెలకు తాగించే నీటిలో మిక్సింగ్ అయ్యాయి. పొట్టేళ్ల దప్పిక తీర్చేందుకు తొట్టెల వద్దకు వదలగా ఆ నీరు తాగి మృతిచెందాయి. కాగా మార్కెట్లో రూ.4లక్షలు విలువ చేసే 38 పొట్టేళ్లను నెలన్నర క్రితం కొనుగోలు చేసి తన తోటలో గడ్డితోపాటు పోషకాహారం వేసి మేపుతున్నాడు. దాదాపు
రూ.2లక్షలు వెచ్చించి నెలన్నరపాటు మేపానని ఉన్నఫలంగా రూ.6లక్షలు విలువ చేసే పొట్టేళ్ళు కళ్ళముందే మరణించడంతో గంగాధర్, ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. రాప్తాడు ప్రాంతీయ పశు వైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ 26 పొట్టేళ్లకు వైద్యం చేసి కాపాడారు. జరిగిన నష్టాన్ని పై అధికారులకు నివేదించామని డాక్టర్ తెలిపారు.


