విశాలాంధ్ర- సచివాలయం: సంపద సష్టిస్తాం ప్రజలకు పంచుతాం … ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా చెప్పే మాట ఇది. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేలా ఉచిత హామీలతో రాజ్యాధికారం కోసం రాజకీయ పార్టీలు చదరంగం ఆడుతున్నాయి. ఎవరు ఎక్కు వ హామీలు ఇస్తారో వారే అధికారం చేపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రాలను అప్ప్పుల ఊబిలోకి నెడుతున్న ప్రభుత్వాలు ప్రజలను సోమరులను చేస్తున్నాయని ఆర్థికరంగ నిపుణులు అంటున్నారు. ఉన్న ఉచితాలు చాలు… ప్రజలకు ఉపాధి పెంచే మార్గాలను అన్వేషించాలని సూచన చేస్తున్నారు. మితిమీరిన ఉచితాలు ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో వడ్డీలు కడుతున్న ప్రభుత్వాలు… ప్రజల భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పోటాపోటీగా వాగ్దానాలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 లో రూ.50,428.28 కోట్లను వడ్డీల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విషయం విదితమే. అప్ప్పులకు వడ్డీలు కట్టేందుకు తిరిగి అప్ప్పులు చేయాల్సిన దుస్థితి ప్రమాద ఘంటికలకు సంకేతమని ఆర్థికరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చేలా ఉంటున్నాయన్న ఆందోళన ఆర్థిక నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉచితాలు రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని తాజా ఆర్థిక గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. విచ్చలవిడి ఉచిత పథకాల వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయనేది స్పష్టం. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 90 శాతం నిధులు కేవలం వడ్డీలు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలకే సరిపోతున్నాయి. ఉచితాల కోసం నిధులను మళ్లించడం వల్ల రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన రంగాలపై పెట్టుబడులు తగ్గుతున్నాయి. ఉచితాలతో ప్రజలు పేదరికం, నిరక్షరాస్యత, పౌష్టికాహారలోపం నుంచి బయటపడటమూ లేదు. ఉచిత పథకాలు సుస్థిరాభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడవని కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సర్వే వెల్లడించింది. పథకాలు ప్రవేశపెట్టాక… మళ్లీ వాటిని రద్దు చేయడం జటిలమని తెలిపింది. 2023-2026 మధ్య ఉచిత పథకాల కోసం రాష్ట్రాల వ్యయం ఐదు రెట్లు పెరిగాయని ఎకనామిక్ సర్వే పేర్కొంది. మహిళా సాధికారిత… ఉపాధి పెరిగిన దాఖలాలూ పెద్దగా లేవని సర్వే పేర్కొంది. అమరావతి నిర్మాణం, పోలవరానికి నిధుల కేటాయింపు, సంక్షేమ పథకాల అమలు మధ్య సమతుల్యత పాటించడం ప్రభుత్వానికి పెద్ద సమస్యగానే మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన వసతుల కల్పన మందగించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, మందుల కొరత… డ్రైనేజీలు, రహదారులు, తాగునీటి ప్రాజెక్టుల కల్పనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ‘అర్హులైన పేదలకు మాత్రమే లబ్ధి చేకూరేలా పథకాలు ఉండాలి. కేవలం నగదు బదిలీకే పరిమితం కాకుండా, దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి. ఆదాయానికి, వ్యయానికి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం అప్ప్పులు చేస్తున్నా… సంక్షేమ మోతాదు మించకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని’ ఎకనామిక్ సర్వే కొన్ని కీలక సూచనలు చేసింది. విద్య, వైద్యంపై దష్టి పెట్టకుండా… ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలను సోమరులను చేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులు మొదలు సకల జనులు దేశంలో అమలవుతున్న పన్నుల విధానంతో ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
ఉచితాలు ఇవ్వకుండా విద్య, వైద్యం అందిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారన్న అభిప్రాయం కొన్ని వర్గాల ప్రజల నుంచి వ్యక్తం అవుతోంది. ప్రజలు… ప్రభుత్వం ఇచ్చే ఉచితాల వైపు ఎదురుచూస్తూ తమకున్న నైపుణ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందనే భావన నెలకొంది. పార్టీలకతీతంగా విద్య, వైద్యం సక్రమంగా అమలు చేస్తే దేశం పురోగతి చెందుతుందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇస్తున్న ఉచితాలు, రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యయ నియంత్రణ పాటిస్తూ, అభివృద్ధి-సంక్షేమం మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
‘ఉచితాలు’ భవిష్యత్‌కు ప్రతిబంధకాలు
- Advertisement -
RELATED ARTICLES


