ఆక్సియోస్ నివేదిక వెల్లడి
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో అమెరికా దాడులపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖామేనీ, ఆయన కుమారుడు మోజ్తాబా ఖామేనీని హతమార్చేందుకు అమెరికా కుట్ర చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఆక్సియోస్ నివేదికలో పేర్కొంది. దీంతో, ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అణు ఒప్పందం అంశంపై ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉదిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. రాబోయే 10 నుంచి 15 రోజుల్లోగా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి హెచ్చరించారు. కాగా, ఇరాన్ సమీపంలో అమెరికా సైన్యం దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్‌కు సమీపంలో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు అనుమతి కోసం వేచిచూస్తున్నాయి. అత్యాధునిక విమానాలు మధ్య ఆసియాకు చేరాయి. మరోవైపు, ఇరాన్, రష్యా కలిసి హార్మోజ్ జలసంధిలో యుద్ధ విన్యాసాలు ప్రారంభించాయి. ఇలాంటి తరుణంలో ఆక్సియోస్ నివేదిక అమెరికా దాడులు, ఖామేనీ గురించిన సంచలన విషయాలు బయటపెట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేనీ, ఆయన కుమారుడు మోజ్తాబా ఖామేనీని హతమార్చేందుకు అమెరికా పథకం రచించినట్లు నివేదికలో పేర్కొంది. ఈ సైనిక ఆప్షన్‌ను డొనాల్డ్ ట్రంప్ ముందు ఉంచినట్లు తెలిపింది. మొజ్తాబాను సుప్రీం లీడర్ వారసుడిగా అంతా భావిస్తున్నారు. ఇరాన్ అగ్రనేతలతో పాటు కీలకమైన ముల్లాలను అంతమొందించేలా రక్షణ శాఖ పలు ప్రతిపాదనలను ట్రంప్ ముందు ఉంచింది. దీనిపై ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ట్రంప్ నిర్ణయం తీసుకుంటే ఇరాన్‌పై అమెరికా దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు… అధ్యక్షుడు ఎప్ప్పుడు నిర్ణయం తీసుకుంటారనే దానిపై స్పష్టత లేదని పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి. వైట్‌హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ మాట్లాడుతూ టంప్ ఎప్ప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆయనకే తెలుసు అని వ్యాఖ్యలు చేశారు. సీనియర్ సలహాదారులు, అధికారులు ఇదే విషయం చెబుతున్నారు.


