తెహ్రాన్: అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖామేనీ మరణించడంతో ఇరాన్ తదుపరి నాయకత్వంపై సందిగ్ధం నెలకొంది. ఇప్ప్పుడు పాలనా పగ్గాలను ఖామేనీ కుమారుడు ముజ్తబా హుస్సేనీ ఖామేనీకి అప్పగించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ పదవి నిర్వహించిన అనుభవమేదీ లేని ముజ్తబా… త్వరలోనే సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఖామేనీ రెండో కుమారుడే ముజ్తబా. 1969లో ఇరాన్‌లోని మషాద్‌లో జన్మించారు. ముజ్తబా పదేళ్ల వయసులోనే ఇరాన్ రాజు మహమ్మద్ రెజా పహ్లవీకి వ్యతిరేకంగా 1979లో ఇస్లామిక్ విప్లవం జరిగింది. ఆ సమయంలో ఖామేనీ కుటుంబం రాజకీయంగా ఎదిగింది. ఆ తర్వాత వీరి కుటుంబం తెహ్రాన్‌లో స్థిరపడింది. కోమ్‌లోని సెమినరీస్లో మత విద్య అభ్యసించిన ముజ్తబా క్లెరికల్ ర్యాంక్‌కు చేరుకున్నారు. కానీ, అత్యున్నత ర్యాంక్ అయిన ఖామేనీని అందుకోలేకపోయారు. అయినా సుప్రీంలీడర్ కార్యాలయంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా మారారు. 1980ల్లో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో ముజ్తబా పాల్గొన్నాడు. ఆ అనుభవమే ఇరాన్ సైన్యానికి ఆయనను దగ్గర చేసింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ)తో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. ముజ్తబాకు సుప్రీం పదవి దక్కడానికి ఇదీ ఓ కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా సుప్రీం లీడర్ నియామకం చేపట్టేందుకు 88 మంది షియా మత పెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్) ఉంటుంది. ఇందులో సభ్యులను ప్రత్యక్ష ప్రజా ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం మత సిద్ధాంతాలకు విరుద్ధమని ఈ కమిటీ భావిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ముజ్తబా నియామకానికి కమిటీలోని కొందరు సుముఖంగా లేరని, కానీ ఐఆర్జీసీ ఒత్తిడితోనే ఆయనకు పగ్గాలు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ముజ్తబా ఇప్పటివరకు ఇరాన్లో అధికారిక పదవులేవీ చేపట్టలేదు. బహిరంగ ప్రసంగాల్లోనూ అరుదుగా కనిపించేవారు. అయినా రాజకీయ నియామకాలు, పాలనాపరమైన నిర్ణయాల్లో తెర వెనుక కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ముజ్తబా ఖామేనీపై 2019లో అమెరికా ఆంక్షలు విధించింది. అయినా ఆయన ప్రపంచవ్యాప్తంగా సంపన్న సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేయడమే గాక… పశ్చిమ మార్కెట్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు పెద్దఎత్తున కథనాలు వెలువడ్డాయి. ముజ్తబా నికర సంపద ఎంతనే దానిపై స్పష్టత లేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆయనకు పెట్టుబడులు ఉన్నాయని,. స్విస్ బ్యాంకు ఖాతాల్లో పెద్దఎత్తున డిపాజిట్లతో పాటు బ్రిటన్‌లో 138 మిలియన్ డాలర్ల విలువైన లగ్జరీ ప్రాపర్టీ ఆయన పేరు మీద ఉన్నట్లు సమాచారం. ఇరాన్ సంప్రదాయవాద రాజకీయ నాయకుడు ఘోలమ్ అలీ కుమార్తె జహ్రాను ముజ్తబా 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. వీరి కుటుంబం గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అయితే, ఇటీవల ఇజ్రాయిల్-అమెరికా సంయుక్త దాడుల్లో ముజ్తబా భార్య మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం లేదు.


