- Advertisement -
ప్రభుత్వ శాఖలలో 10 సంవత్సరాలుగా వినియోగంలో లేని బ్యాంకు అకౌంట్లు రద్దు చేసి, సదరు అకౌంట్లలో సొమ్మును కలెక్టరేట్ లోని ప్రభుత్వ ఖాతాకు జమచేయాలి…
ప్రధాన పనితీరు సూచికలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలి…
అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష …
విశాలాంధ్ర ఏలూరు:వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజలందరూ వినియోగించుకునేలా విస్తృత అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం వాట్సాప్ గవర్నెన్స్, ప్రభుత్వ శాఖలలో ఆన్ క్లయిమ్డ్ డిపాజిట్లు, అక్షర ఆంధ్ర, కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్, డాకుమెంట్స్ ఆన్లైన్ అప్లోడ్, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ, తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటివద్దకు తీసుకువెళ్లేందుకు ఉద్దేశించిన వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, వాట్సాప్ గవర్నెన్స్ ను గ్రామ స్థాయిలోని ప్రతీ ఇంటివద్దకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లాలోని ప్రభుత్వ శాఖలలో 10 సంవత్సరాలుగా వినియోగంలో లేని బ్యాంకు అకౌంట్లు రద్దు చేసి, సదరు అకౌంట్లలో సొమ్మును కలెక్టరేట్ లోని ప్రభుత్వ ఖాతాకు జమచేసేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. శాఖల వారీగా వినియోగంలో లేని బ్యాంకు అకౌంట్ల వివరాలను తెలియజేసి, వాటిలో వినియోగించకుండా నిల్వ ఉన్న నిధులను కలెక్టరేట్ లోని ప్రభుత్వ ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోకో సిటీ ఏర్పాటుకు సంబంధించి పనులు వెంటనే చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలోని డాకుమెంట్స్ ను ఏజెంట్ స్పేస్ నందు అప్లోడ్ చేయాలన్నారు. అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా నిర్దేశించిన లక్ష్యాల మేర అభ్యాసకులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు.సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, డిఆర్డిఏ పిడి విజయలక్ష్మి , డీఈఓ వెంకటలక్ష్మమ్మ, సమగ్ర శిక్ష ఏపి డి పంకజ్ కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం వెంకటరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భాను ప్రతాప్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శోభ, ఐసిడిఎస్ పిడి పి. శారద, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి, మెప్మా పీడీ రాజా బాబు, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


