మనిషి హృదయంలో, అందమైన
మొక్కొకటి మొలిచింది
రెమ్మల్లోంచి అవాంఛనీయ
కోర్కెలు రంగురంగుల
పువ్వులై విరబూశాయి
అందులో ఒకటి, పరాయి
నేల నాక్రమించటం
దానికి దన్నుగా సైన్యమనే
ముళ్ల రెమ్మల్ని ముందుంచటం
ఒకడి స్వార్థ ఫలాపేక్షకు
యుద్ధం అనివార్యమైతే
జన నష్టం ఆస్తి నష్టం తప్పదు
ఈ భయాన్ని జయించటానికి
దేశ విదేశాలు, ఎవరి మట్టుకు వాళ్లు
రక్షణ పరికరాల సేకరణలో
ఆత్రుతతో తలమునకలై
లక్షల కోట్లు బూడిదలో పోస్తారు
దేశ ప్రగతిని పక్కకు నెట్టి
ఆయుధ కొనుగోళ్లలో
అందరి కంటే ముందుండటమొక వింత
కొందరిది వ్యాపారమై
లాభాల పంట పండుతుంది
కొందరి భయానికిదే కవచమౌతుంది
పరిశ్రమల కవసరమైన ధనం
దేశంచుట్టూ గోడలుగా మారుతుంది
ఎవరిమట్టుకు వాళ్లు
మొలిచిన మొక్క ఎదగకుండ
వేళ్లతో పీకి పారేస్తే
అంతా నిర్మలమే కదా!
అచ్చోటనే శాంతి వంగడాలు మొలుస్తాయి
మనిషి జీవితం నిర్భయమై
పసిడి కాంతులకు ఆలవాలమౌతుంది
`ఎస్.ఆర్.పృద్వి, 9989223245
యుద్ధ భయం
- Advertisement -


