Homeసాహిత్యంచతురోక్తుల చక్రవర్తినడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి

చతురోక్తుల చక్రవర్తినడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి

- Advertisement -
రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం.
ఒకాయన ఒకరోజు శాస్త్రి వద్దకు వచ్చి,“అయ్యా మనం బయటికి వెళ్లేటప్పుడు కుక్క కుడివైపు నుంచి ఎదురైతే మంచిదా లేక ఎడమవైపు నుంచి ఎదురైతే మంచిదా?” అంటూ అడిగారట. 
“ఎటువైపు నుంచి ఎదురైనా, అది మన మీద పడి కరవకుండా వెళ్లిపోతే అదే మంచిది!” అంటూ ఠకీ మనీ సమాధానం ఇచ్చారట శాస్త్రి. 

తన జీవితమంతా చతురోక్తులు సంధించి నవ్వులు పూయించిన ఆ శాస్త్రే, శ్రీ నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి! అలనాటి ఈ చతురోక్తి, అనేకమంది పేర్ల మీద చలామణి అవుతూ, ఇప్పటికీ సజీవంగానే ఉంది.
నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి తెలుగు, సంస్కృత భాషలలో మహా పండితుడు. ఆయన రాసిన ‘శబ్ద మంజరి’ సంస్కృతం నేర్చుకునే విద్యార్థులకు ప్రాథమిక గ్రంథము.
వీరు పార్వతీపురం పట్టణం దగ్గర కల నాగూరు అగ్రహారంనకు చెందినవారు. శ్రీమతి శ్యామల సోదెమ్మ, శ్రీ చైనులు దంపతులకు శాస్త్రి 1759 లో జన్మించారు. ఆయనకు ఒకరకమైన ధైర్యంతో కూడిన ఆత్మగౌరవ పూరితమైన స్వభావం ఉండేదని, ఎవరిని మన్నన చేయరనే పేరు కూడా ఉండేదని తెలుస్తోంది!
‘అభినవ కాళిదాసు’ అని బిరుదు పొందిన శాస్త్రి సమాస కుసుమావళి, శబ్దమంజరి, రామాయణ సంగ్రహము, విభక్తి విలాసము మొదలైన రచనలు చేశారు .
అంతేకాదు, ఎంతో ప్రముఖమైన ‘శ్రీ జగన్నాథాష్టకం’ రచించారు.
ఈ జగన్నాథ అష్టకం వ్రాసిన వైనం ఏమిటంటే, ఒకసారి మంగళేశ్వరశాస్త్రిపై అసూయతో అవమానింపదలచిన కొందరు, ‘అశుభ్రంగా మురికిబట్టలతో ఉన్న ఒకనిచేత ఎంగిలి చిప్పలో జగన్నాథస్వామి వారి ప్రసాదం పంపారు. దానిని నిరాకరించిన శాస్త్రికి ప్రసాద దూషణ కారణంగా కన్నులు పోయినవి. అప్పుడు శాస్త్రి శ్రీ జగన్నాథస్వామిపై ఆసువుగా “నయన పథగామీ భవతుమే”… ‘నా కనులకు మార్గము, దృష్టి ఇమ్ము’ అన్న మకుటంతో అష్టకం చెప్పి వేడుకున్నారు. ప్రసన్నుడైన శ్రీ జగన్నాథస్వామి దృష్టిని ఇవ్వగా, శాస్త్రి, “ప్రభూ! నేను తమ ప్రసాద దూషణ చేసినందుకు తమరు విధించిన శిక్షకు పాత్రుడనే! కావున నా ఒక కన్నుతీసుకో స్వామీ! కానీ నీ చక్కని రెండుకనులతో అందరినీ కృపాదృష్టితో చూడు!” అని వేడుకొన్నారట!
‘దేవునితోనే చతుర చమత్కారం చేయగల మహా వాంగ్మి సర్వమంగళేశ్వరశాస్త్రి !’ అని యామిజాల పద్మనాభస్వామి పేర్కొన్నారు. కాగా, తమ జీవితములో మంగళేశ్వరశాస్త్రి ఒక కన్నుతో ఉండేవారన్నది చరిత్ర!!
ఆయన ఒకసారి పూసపాటి ఆనంద గజపతి కొలువుకు వెళ్లారు. శాస్త్రి ఇంటిపేరు నడిమింటిని దృష్టిలో పెట్టుకొని, “గురువుగారూ! అటు ముందర ఇల్లు కాకుండా, వెనుక ఇల్లు కాకుండా నడిమిల్లు ఏమిటండీ చిత్రంగా!?” అన్నారు ఆనంద గజపతి వ్యంగ్యంగా.
“మహారాజా! ఎంత నడిమిల్లు అయినా పూసపాటి చేయదా?” అని అదే ఇంటిపేరుతో తిప్పికొట్టారు శాస్త్రి.
ఒకసారి జగన్నాథ క్షేత్రం వెళ్ళినప్పుడు శాస్త్రి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తూ, ఆలయ ప్రాకారంలోని మర్రిచెట్టు ఆకులు నాలుగు కోసి, చేత్తో పట్టుకున్నారట.
అది ఒక ఉత్కళ పండితుడు చూసి,“అయ్యా మర్రాకులు ఎందుకు కోశారు?” అని అడిగితే, “విస్తరిగా కుట్టి భోజనం చేయడానికి!” అన్నారట శాస్త్రి.
“భగవంతుడు పటపత్ర సాయి కదా! భగవంతుడి శయ్యపై భుజించుట తగునా?”అని వ్యంగ్యంగా అంటే,
“ఉత్కళులు భగవంతుని అవతారంలో మత్స్య, కూర్మ, వరాహములనే భుజించుచున్నారు కదా…ఆయన శయ్యపై భుజించడం మీకు తప్పు అనిపిస్తోందా?” అంటూ సమాధానమిచ్చారట శాస్త్రి.
శాస్త్రి కుమారుడు భగవత్ పతంజలిశాస్త్రికి వివాహం జరుగుతోంది. ఆడపిల్ల వారు పెళ్ళికొడుకుని తలుపు దగ్గర ఆటకాయించి ,‘పెళ్లికూతురు పేరు చెబితే గాని తలుపు తీయ’మని పట్టుబట్టారు.
“మేము పేరు చెప్పవలసిన వారం కాము!” అన్నాడు పెళ్ళికొడుకు బెట్టు చేస్తూ.
“అలా కుదరదు!” అంటూ పట్టుపట్టారు ఆడపెళ్ళివారు.
పక్కనే నిలబడిన శాస్త్రి,“అబ్బాయి! నీవన్నమాట ముమ్మారు చెప్పరా!” అన్నారు.
“మేము పేరు చెప్పవలసిన వారము కాము.. కాము.. కాము!..” అన్నాడు పెళ్ళికొడుకు బింకంగా.
“సరే !! ఇక ఇరువైపు పంతాలు చెల్లిపోయాయి కనుక తలుపు తీయండి!” అంటూ చమత్కరించారు శాస్త్రి. నలుగురూ తెల్లపోయారు! పెళ్లికూతురు పేరు కామాక్షి …తల్లిదండ్రులు కాము.. కాము.. అని కూడా పిలుస్తారుట!!
సర్వమంగళేశ్వరశాస్త్రి దక్షిణ దేశయాత్రలో ఓ రోజున ఆనందతాండవ పురము అనే ఒక అగ్రహారంలో ఒక తమిళ బ్రాహ్మణుని ఇంట్లో భోజనం చేశారు. ఆ ఇంటి యజమానురాలు శాస్త్రికి నెయ్యి వడ్డించింది. అనంతరం ఆ నేతిగిన్నె మీద శాస్త్రి ఓ శ్లోకం చెప్పారు. దాని అర్థం ఏమిటంటే- ‘ఆనందతాండవపురమున ఒక ద్రావిడుని ఇంటి యందు ఆద్య పాత్ర అంటే నేతి గిన్నె, అరుంధతి నక్షత్రం వలె ఉన్నది. కనీ కనిపించకుండా మినుకు మినుకుమని ఉంది. అంత చిన్న గిన్నె అన్నమాట. అందులో గరిట మెరుపుతీగ వలె నాట్యమాడుతున్నది. అంతలోనే కనిపించి అంతలోనే మాయమవుతున్నది. గరిటలో నుంచి పడే నేతిధారను యోగ సిద్ధి పొంది దివ్యదృష్టిని సంపాదించిన మహామహులు మాత్రమే చూడగలరు!’ అంత కొద్దిగా నెయ్యి వడ్డించినందుకు ఆయనకు ఒళ్ళు మండిందన్నమాట!
సత్యప్ప పంతులు అనే ఉద్యోగిమీద శ్రీ శాస్త్రి చెప్పిన ఓ శ్లోకం.
అ మంగళే మంగళ వార సంజ్ఞా
అ పుణ్యగే పుణ్యజన ప్రతీతిః
అసత్యసే సత్యప ఇత్యభిఖ్యా
త్రయః ప్రసిద్ధా విపరీత రీత్యా
‘అమంగళమగు వారమునకు మంగళవారము అని పేరు పెట్టుట, అతిపాపులగు రాక్షసులకు పుణ్యజనులు అని పేరు పెట్టుట, నిరంతరము అసత్యములే పలుకు వీనికి సత్యప్ప అని పేరు పెట్టుట… ఈ మూడును ప్రసిద్ధ విపరీతములు.. ‘ అని దాని అర్థం.
కర్మజ్ఞాన వివరణ, వేదసారము, పార్థ విజయము, శ్రీ లలితా పంచదశమంత్ర వర్ణమాలా స్తోత్రం, సూర్యాష్టకం మొదలైన ఇంకాఎన్నో గ్రంథాలు రచించిన శ్రీ సర్వమంగళేశ్వర శాస్త్రి 1830 వ సంవత్సరంలో స్వర్గస్తులయ్యారు.
నడిమింటి సర్వ మంగళేశ్వరశాస్త్రి స్మృతికి మన తెలుగు వారందరం నివాళులర్పిద్దాం. సెలవు నమస్కారం.
సెల్: 9440318415

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు