వాషింగ్టన్: అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం కేసీ-135 ట్యాంకర్ ఉత్తర ఇరాక్‌లో గురువారం కుప్పకూలింది. ప్రమాదంలో ఎంతమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారనేది అమెరికా అధికారులు ప్రకటించలేదు. సహాయ కార్యక్రమాలు చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. రెండు సైనిక ట్యాంకర్ విమానాలు ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. రెండో విమానం సురక్షితంగా దిగినట్లు పేర్కొంది. మరోవైపు ఇరాక్‌కు చెందిన ఇస్లామిక్ రెసిస్టెన్స్ రెబల్ గ్రూప్ తామే అమెరికా విమానాన్ని కూల్చేసినట్లు ప్రకటించింది. ఈ గ్రూప్ ఇరాన్‌కు అనుకూలంగా పనిచేస్తోంది. ఆ సంస్థ అధికారిక టెలిగ్రామ్ ఛానెల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ తోసిపుచ్చింది. శత్రువుల దాడి లేదా ఫ్రెండ్లీ ఫైర్‌లో ఇది కూలిపోలేదని వెల్లడించింది. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది చనిపోయినట్లు ఇరాన్ మీడియా చెబుతోంది. కేసీ-135 స్ట్రాటోట్యాంకర్లో కనీసం ముగ్గురు సిబ్బంది ఉండాల్సి ఉంటుంది. వీరిలో పైలట్, కోపైలట్, ఆపరేటర్ ఉంటారు. వీరితోపాటు నేవిగేటర్, మిషన్ ఆధారంగా అదనపు సిబ్బందిని తరలిస్తుంటారు. వందల సంఖ్యలో అమెరికా, ఇజ్రాయెల్ విమానాలు దాడులకు వెళుతుండటంతో ట్యాంకర్ విమానాల అవసరాలు గణనీయంగా పెరిగాయి. యుద్ధ సమయంలో విమానాలకు గాల్లో ఇంధనం నింపడమే వీటి పని.
ఇరాక్‌లో కుప్పకూలిన అమెరికా రీఫ్యూయలింగ్ విమానం
- Advertisement -
RELATED ARTICLES


